బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (16:31 IST)

ఆర్టికల్ 370 రద్దుకు సంపూర్ణ మద్దతు.. అదితి - రద్దుకాలేదంటున్న సాల్వే

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ, అదే పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీ మాత్రం గట్టిగా సమర్థిస్తోంది. ఆమె పేరు అదితి సింగ్. రాయబరేలీ సదర్ సెగ్మెంట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోంది. 
 
ప్రధాని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌కు ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉందన్నారు. 370 రద్దును రాజకీయం చేయొద్దని అదితి సూచించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఆమె కొనియాడారు.
 
ఒక ఎమ్మెల్యేగా 370 అధికరణ రద్దును స్వాగతిస్తున్నానని అదితి సింగ్ చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ వైఖరితో సొంత పార్టీ నేతలు ఖంగుతిన్నారు. అదితి సింగ్‌తో పాటు మరికొందరు నేతలు పార్టీ వైఖరిపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దును విపక్ష కాంగ్రెస్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించినప్పటికీ వాస్తవంగా అది రద్దు కాలేదని ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, మాజీ సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అభిప్రాయపడ్డారు. ఇక్కడ రద్దు అన్నది కేవలం ఓ ఓపోహ మాత్రమే. 
 
'ఈ అధికరణంలోని సెక్షన్-3.. జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తోంది. అదేసమయంలో ఎప్పుడైనా ప్రత్యేక హోదాను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రపతికి అధికారాలను కూడా సంక్రమింపజేస్తోంది. ఈ ఆర్టికల్‌లోని నిబంధనలను ఎలా చూసినా.. రాష్ట్రపతి పబ్లిక్ నోటిఫికేషన్ ఆర్డర్ ద్వారా దీన్ని నిలిపివేయవచ్చు. లేదా కొన్ని సవరణలను సూచించవచ్చు. సెక్షన్-3 ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని అని ఆయన ఓ  ఇంటర్వ్యూలో వివరించారు. 
 
ఈ నిబంధనను వినియోగించుకునే ప్రభుత్వం సోమవారం రాష్ట్రపతి కోవింద్ సంతకంతో కూడిన ఓ ఆర్డరును ఒక్కసారిగా అమలులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. చూడబోతే పార్లమెంట్ ఆమోదానికి లోబడి రాష్ట్రపతి ఈ ఆర్డర్ జారీ చేసినట్టు కనబడుతోందని హరీష్ సాల్వే అన్నారు. దీన్ని రద్దు చేయాలని పార్లమెంటు కోరితే తప్ప.. ఇది కొనసాగుతుందని సాల్వే చెప్పుకొచ్చారు.