సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:43 IST)

పశ్చిమబెంగాల్‌లో ఆరో దశ పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆరోదశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడుగంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 43 నియోజకవర్గాల్లో జరగనున్న పోలింగ్‌లో 306 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

43 స్థానాల పరిధిలో మొత్తం 1.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎటువంటి ఉద్రిక్త ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం ప్రత్యేక  బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో ప్రతిరోజూ పదివేల మార్కును దాటి కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఓటర్లు వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.
 
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేడు మూడు ప్రాంతాల్లో జరగనున్న బహిరంగ సమావేశాల్లో పాల్గొననున్నారు. బెంగాల్‌ బిజెపి చీఫ్‌ దిలీఫ్‌ ఘోష్‌ నాలుగు రోడ్‌షోలు , బిజెపి నేత సువేందు అధికారి కోల్‌కతాలో మూడు రోడ్‌షోలు చేపట్టనున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నాలుగు సమావేశాల్లో పాల్గొననున్నారు. అయితే కరోనా నేపథ్యంలో సిపిఎం, కాంగ్రెస్‌లు తమ ప్రచారాన్ని రద్దు చేసుకున్నాయి.
 
కాగా, రాష్ట్రంలో మంగళవారం మూడు చోట్ల పేలుళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్‌ జరగనున్న నియోజకవర్గాల పరిధిలోనే మంగళవారం నాటు బాంబు పేలుళ్లు జరగడం గమనార్హం. ఈ పేలుళ్లలో ఒకరు మృతి  చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని  పోలీసులు తెలిపారు.

24 నార్త్‌ పరగణాలు జిల్లాలోని తితాగఢ్‌లో ఉన్న జిసి రహదారిలో మొదటి పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడగా.. రాజ్‌కిశోర్‌ జాదవ్‌(28) అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మరో వ్యక్తి ప్రస్తుతం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆరో విడత పోలింగ్‌ జరగనున్న బరాక్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తితాగఢ్‌లో ఎన్‌జెఎంసి పత్తి మిల్లు ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని దుండగులు నాటు బాంబులతో దాడి చేశారు.

బిజెపి నేత సంతోష్‌ జేనా నివాసాన్ని టార్గెట్‌ చేసుకుని దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి రెండు పేలని నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.