శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా.. సరే అన్న సోనియా?

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సమ్మతించారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. 
 
రెండు రోజుల క్రితం పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ససేమిరా అనడంతో, రాహుల్ నిర్ణయానికి సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
పైగా, తాను మళ్లీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టబోనని, మరొకరిని ఎంపిక చేయాలని రాహుల్ గట్టి పట్టుమీద ఉండటం, అధిష్టానం దూతలు అహ్మద్‌ పటేల్, కేసీ వేణుగోపాల్‌‌లతో పాటు సోనియా గాంధీ సైతం రాహుల్‌ను వారించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 
 
కాంగ్రెస్‌ చీఫ్‌‌గా రాహుల్ తప్పుకున్న పక్షంలో తాను తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానని సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం హెచ్చరించినట్టు తెలుస్తోంది. రాహుల్ విషయంలో వదంతులను ప్రచురించవద్దని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌‌దీప్‌ సూర్జేవాలా మీడియాకు సూచించారు.