అక్కమొగుడా.. కీచకుడా..? భర్తకు దూరంగా వుంటే.. పెళ్లి చేసుకుంటానని..?
అక్క మొగుడు బావ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్తతో ఏర్పడిన విబేధాల కారణంగా అతనికి విడాకులిచ్చి.. బ్యూటీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరదలిపై కన్నేసిన బావ.. ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. ఒంటరిగా ఉంటున్న ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
బావ ప్రతిపాదనతో షాకైన ఆ మహిళ అక్కకు అన్యాయం చేయలేనని స్పష్టం చేసింది. కానీ బుద్ధి మార్చుకోని ఆ ప్రబుద్ధుడు ఆమెను పెళ్లి పేరుతో వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. చివరికి.. బావ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. దీంతో.. పోలీసులు ఆ ప్రబుద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కేజీ హళ్లికి చెందిన ఓ వివాహిత భర్త నుంచి దూరంగా ఉంటూ బ్యూటీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల ఆమెకు సంబంధాలొస్తున్నాయి. అలా మరదలి కోసం వచ్చే సంబంధాలను చెడగొడుతున్నాడని.. తన మరదలను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పడంతో వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పోయాయని పోలీసుల విచారణలో తేలింది. తాను పెళ్లి చేసుకుంటానని, శారీరకంగా దగ్గరవుదామని పలుమార్లు సదరు వివాహితను ఆమె బావ వినోద్ వేధించేవాడు. ఎంత చెడ్డా అక్క భర్త కావడంతో ఆ మహిళ కొంత వరకూ అతని వేధింపులను భరించింది.
కానీ.. రోజురోజుకూ అతని టార్చర్ ఎక్కువ కావడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆమె ఆవేదనను పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు. ఆ మహిళ అక్క వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
దీంతో.. ఎవరూ తన ఆవేదనను పట్టించుకోవడం లేదని భావించిన వివాహిత శివాజీనగర్‌లోని తన ఆంటీ ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్నంతా తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. బావ వేధింపులు ఎక్కువయ్యాయని, ఇక తనకు బతకాలని లేదని తల్లితో ఫోన్‌లో చెప్పిన కొద్దిసేపటికే సదరు వివాహిత తన ఆంటీ ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
ఆమె ఆత్మహత్యకు యత్నించిన విషయం తల్లికి తెలియడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆమె కూతురిని బీఆర్ అంబేద్కర్ హాస్పిటల్‌కు తరలించింది. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ఆమె తాగిన పురుగుల మందును వైద్యులు ఎట్టకేలకు కక్కించి కడుపును శుభ్రం చేశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఆమె బావను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు.