మార్చి నెల చాలా హాట్ గురూ... వడగాల్పులు వీచే ప్రమాదం...
ఈ యేడాది వేసవికి రెండు నెలల ముందు నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీనికి నిదర్శనంగా ఫిబ్రవరి నెలలోనే పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, మార్చి నెలలో ఈ ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు దేశ ప్రజలతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరిక చేసింది. దీంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచన చేసింది. ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు లేఖలు రాసారు.
ఎండ తీవ్రత వల్ల కలిగే అనారోగ్యాలు సంబంధించి రోజువారీ సర్వీలెన్స్ చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఎండల తీవ్రత కారణంగా సంభవించే మరణాలతో పాటు అనారోగ్య మరణాలను మార్చి ఒకటో తేదీ నుంచి ఎన్.సి.డి.సి. వెబ్‌సైట్లలో రోజువారీగా అప్‍డేట్ చేయాలని ఆయన కోరారు. ఎండల్లోపనిచేసేవారు, గుండె జబ్బులున్నవారు, హైబీపీ ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు, పిల్లలకు రిస్క్ ఎక్కువ అని, వీరి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా, నేషనల్ ప్రోగ్రాం ఆన్ క్లైమేట్ ఛేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ జారీ చేసే హీట్ వేవ్ అలెర్ట్‌ను బట్టి ఆయా ప్రాంతాల అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.