శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (09:48 IST)

తెలంగాణాతో 'చిన్నమ్మ'కు ప్రత్యేక అనుబంధం... ఆ ట్వీట్‌కు జనం జేజేలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పెద్దమ్మ (సోనియా గాంధీ) కీ రోల్ ప్లే చేస్తే... చిన్నమ్మ (సుష్మా స్వరాజ్) తన వంతు సహకారాన్ని అందించారు. ఫలితంగా పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. ఆ సమయంలో సీమాంధ్ర ప్రజల దృష్టిలో సుష్మా స్వరాజ్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటే... తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం చిన్నమ్మగా ముద్రపడిపోయారు. అంతేనా గల్భ్ దేశాల్లో కష్టాలు పడుతున్న అనేక మంది తెలంగాణ కార్మికులను క్షేమంగా స్వదేశానికి చేర్చడంలో సుష్మా స్వరాజ్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఫలితంగా ఎంతో మంది ఆమెను తమ గుండెల్లో పెట్టుకున్నారు. 
 
ముఖ్యంగా, 2014, ఫిబ్రవరి 18వ తేదీన లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై అత్యంత కీలక చర్చ జరుగుతున్న సమయంలో అప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి, బీజేపీ సీనియర్ నేతలను ఒప్పించిన సుష్మా స్వరాజ్ భావోద్వేగ ప్రసంగాన్ని చేశారు. 'ఆరు దశాబ్దాలుగా పడుతున్న ప్రసవ వేదనను తీర్చే సమయం వచ్చేసింది. ఎన్నో త్యాగాలు, మరెన్నో బలిదానాల మధ్య, పండంటి తెలంగాణ బిడ్డ జన్మించనుంది. మేమిచ్చిన వాగ్దానం మేరకు మా మాటను నిలబెట్టుకున్నాం. నేడు జన్మించనున్న తెలంగాణ బిడ్డ ఎదిగేందుకు పాటుపడతాం. తెలంగాణ ప్రజలారా, ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి' అంటూ సుష్మా చేసిన ట్వీట్ వైరల్ అయింది. 
 
పైగా తెలంగాణ వాసులకు తాను చిన్నమ్మనని చెప్పుకునే సుష్మా, అంతకుముందు కూడా పలుమార్లు ఈ ప్రాంత వాసులకు ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్న భరోసాను కల్పించారు. రాష్ట్ర ఏర్పాటుకు తాను అండగా ఉంటానంటూ చెప్పిన బీజేపీ తొలి మహిళా నేత కూడా సుష్మా స్వరాజే కావడం గమనార్హం. ఢిల్లీ వేదికగా తెరాస నిర్వహించిన ప్రతి ఆందోళనకు ఆమె హాజరై తన సంపూర్ణ మద్దతును తెలిపారు. 
 
ఆపై రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ, జైట్లీలను ఒప్పించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సుష్మా, మంగళవారం అర్థరాత్రి కన్నుమూయడంతో తెలంగాణ వాసులు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. విభజన నాడు సుష్మా చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోతుందని అంటూ నివాళులు అర్పిస్తున్నారు.