శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (12:27 IST)

తమిళనాడులో సండే లాక్డౌన్ : మండే నుంచి కొత్త ఆంక్షలు

కరోనా వైరస్ సునామీ ప్రళయం తాకిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, అనేక కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు నడుంబిగించింది. 
 
ఇప్ప‌టికే రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న రాష్ట్రం ఇప్పుడు మరిన్ని క‌ఠిన నిర్ణ‌యాలు చేసింది. ఈ ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ విధించింది. దాంతో రాజ‌ధాని చెన్నై స‌హా రాష్ట్రంలోని ప‌లు న‌గ‌రాల్లో రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
 
అంతేగాక సోమ‌వారం నుంచి అమ‌ల్లోకి వ‌చ్చేలా ప‌లు నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాలు చేసింది. శనివారం ఉదయం రెండోవిడతగా ముఖ్యమంత్రి ఎడప్పాడితో చర్చలు జరిపిన మీదట 19 రకాల కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీ వేకువజాము నుండి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలిలా వున్నాయి..
 
* రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, రిక్రియేషన్‌ క్లబ్బులు, బార్లు, ఆడిటోరియంలు, మీటింగ్‌ హాల్స్‌ మూతపడనున్నాయి.
 
* పెద్ద దుకాణాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, షాపింగ్‌ మాల్స్‌ నడిపేందుకు అనుమతి లేదు. కిరాణా దుకాణాలు, కాయగూరలు, మాంసం దుకాణలు కరోనా వ్యతిరేక నిబంధనల పాటింపుతో నడిపేందుకు అనుమతి. 
 
* వాణిజ్య సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌లో కూరగాయల దుకాణాలు, కిరాణా దుకాణాలు నడిపేందుకు అనుమతి లేదు. కాయగూరలు, కిరాణా సరుకులు విక్రయించే డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ ఏసీ సదుపాయం లేకుండా 50 శాతం కస్టమర్లను అనుమతించి నడుపుకునేందుకు అనుమతి.
 
* చెన్నై కార్పొరేషన్‌ సహా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, పురపాలక సంఘాలలోని బ్యూటిపార్లర్లు, స్పాలు, సెలూన్లు మూసివేత.
 
* రెస్టారెంట్లు, హోటళ్లు, మెస్‌లు, టీ షాపులలో పార్శిల్‌ విక్రయాలకు మాత్రమే అనుమతి. టీ దుకాణాలు కూర్చొని లేదా నిల్చొని టీ తాగేందుకు, హోటళ్లలో కస్టమర్లు కూర్చుని భోజనం చేసేందుకు అనుమతి లేదు.
 
* ఆలయాలు, చర్చిలు, మసీదులు తదితర ప్రార్థనా స్థలాల్లో భక్తులకు అనుమతి లేదు. నిత్యపూజలు భక్తులు లేకుండా జరుపుకోవచ్చు.ఆన్‌లైన్‌ వ్యాపారాలు ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాయి. 
 
* ఆలయాల్లో కుంభాభిషేకాలు, వార్షిక ఉత్సవాలను భక్తులు లేకుండా జరుపుకునేందుకు అనుమతి. కుంభాభిషేకం వంటి వేడుకలకు జిల్లా కలెక్టర్ల అనుమతి తప్పనిసరి. కుంభాభిషేకాలకు తేదీలను ప్రకటించి వుంటే 50 మంది భక్తులకు మాత్రమే అనుమతి. 
 
* వివాహాది శుభకార్యాలలో పాల్గొనేందుకు 50 మందికి మాత్రమే అనుమతి. అంతిమయాత్రలు తదితర అశుభకార్యాలలో 25మందికిపైగా పాల్గొనేందుకుఅనుమతి లేదు.
 
* ఐటీ, ఐటీ సంబంధిత కంపెనీలలో 50 శాతం ఉద్యోగులు మాత్రమే పనిచేయడానికి అనుమతి. తక్కిన 50 శాతం మంది ఇంటిపట్టునే పనిచేయాల్సి వుంటుంది. ఆ విధంగా యాజమాన్యాలు వసతులు కల్పించాలని ఆదేశించింది. 
 
* గోల్ఫ్‌, టెన్నిస్‌ క్లబ్‌ తదితర క్రీడా శిక్షణా సంస్థలు, స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలు పనిచేయడానికి అనుమతి లేదు. అయితే జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేవారు క్రీడాకారులకు ఈ నిబంధన వర్తించదు.
 
* పుదుచ్చేరి మినహా ఇతరరాష్ట్రాలకు చెందినవారు రాష్ట్రంలో ప్రవేశించడానికి ఈ-పాస్‌ తప్పనిసరి. విదేశాల నుండి విమానాల్లో, నౌకలలో వచ్చేవారు ఈ-పాస్‌లు తీసుకోవాల్సిందే. బస్సులలో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడానికి వీలులేదు. టాక్సీలు, ఆటోలలో ప్రయాణించడానికి డ్రైవర్‌ మినహా ముగ్గురు (ట్యాక్సీ), ఇద్దరి(ఆటో)కి మాత్రమే అనుమతి.