మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (09:58 IST)

నీటిలో చెన్నై మహానగరం - విద్యుత్ సరఫరా బంద్ - మరో రెండు రోజులు భారీ వర్షాలే

తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల రాకతోపాటు... బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు 16 జిల్లాల్లో సాధారణం నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
 
ముఖ్యంగా శనివారం రాత్రి నుంచి చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు చెన్నై మహానగరంలో నీటిలో చిక్కుకునిపోయింది. ఈ వర్షాలకు చెన్నై శివారు ప్రాంతాలు నీటితో నిండిపోగా.. నగరంలోని ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. చెన్నై పరిసరాల్లోని మూడు రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది.
 
కొళత్తూర్‌, పెరవళ్లూర్‌, కేకేనగర్‌ ఇండ్లలోకి నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్‌ సరఫరా లేక బయటకు రాక.. ఇండ్లలో ఉండలేక అష్టకష్టాలు పడుతున్నారు. చాలాచోట్ల రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కార్పొరేషన్‌ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
 
మోటార్ పంపు సెట్లతో లోతట్టు ప్రాంతాల్లోని నీటిని తొలగిస్తున్నారు. తిరువళ్లూర్‌, చెంగల్‌పట్టు, కంచి జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో నాలుగు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయి.
 
ఇదిలావుండగా, మరో రెండు రోజులు తమిళనాడులో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించగా.. ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం భయాందోళనకు గురవుతున్నారు. 
 
ఈ క్రమంలో మూడు రోజుల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెన్నై, సమీప జిల్లాల్లో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురంలో పాఠశాలలు, కళాశాలలకు, తిరువళ్లూర్‌ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. చెన్నైతో పాటు.. మరికొన్ని జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.