ఏ సమయంలోనైనా ఉగ్రదాడులు: ఇంటెలిజెన్స్
దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం అయోధ్యపై చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ దాడులకు ప్రణాళికలు వేసుకున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి.
భారీ దాడులకు పాల్పడే అవకాశమున్నట్లు తెలిపాయి. ఈ మేరకు ఏ సమయంలోనైనా దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) సంస్థలకు చెందిన అధికారులు తెలిపారు. దీనిపై ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని మాకు సమాచారం అందింది.
అయోధ్య తీర్పు ఏ రోజైనా వెలువడవచ్చనే వార్తలు బయటకి వచ్చినప్పటి నుంచి జైషే ప్రణాళికల్లో వేగం పెరిగింది. ఇప్పటికే భద్రతా దళాలకు సమాచారం అందజేశాం. ఈ ఉగ్ర సంస్థ పలు కీల ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. అందులో న్యూ దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లు ప్రధానంగా ఉన్నాయి’ అని తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉగ్ర మూకలు ఇలాంటి కుట్రలకు ప్రణాళికలు వేస్తూనే ఉన్నాయి. మరోవైపు భారత భద్రతా దళాలు కూడా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశాయి.
తాజాగా అయోధ్య తీర్పు వెలువడటంతో మరోసారి దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేశాయి.