అయ్యప్ప ఆలయానికి రోజూ 25 వేల మందికి ప్రవేశం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయం అధ్యక్షతన నేడు జరిగిన సమీక్ష సమావేశంలో శబరిమలలో మండల మకరవిలక్కు ప్రారంభమైన నాటినుండి ప్రతిరోజూ 25 వెలమందిని అనుమతించాలని నిర్ణయించారు. ఒకవేళ ఈ సంఖ్యను పెంచే విషయం ఉంటే, తరువాత చర్చించి నిర్ణయించడం జరుగుతుందని సమావేశం తీర్మానించింది.
ఇంకా కోవిడ్ నిబంధనలు మేరకు అవసరమైన చర్యలు తీసుకోబడతాయి. "వర్చువల్ క్యూ" సిస్టమ్ కొనసాగుతుంది. 10 సంవత్సరాల లోపు మరియు 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న యాత్రికులు కూడా ప్రవేశానికి అనుమతించబడతారు.
అయితే శబరిమల వచ్చే అయ్యప్పలు రెండు మోతాదుల కోవిడ్ వ్యాక్సిన్ లేదా ఆర్టిపిసిఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ వచ్చిన వారికి ప్రవేశం అనుమతించ బడుతుంది. అభిషేకం చేసిన నెయ్యిని అందరికి అందేలా దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేయాలని సిఎం పినరయి విజయన్ ఈ సమావేశంలో చెప్పారు.
అయ్యప్పలను దర్శనం అనంతరం సన్నిధానంలో ఉండడానికి అనుమతించరు. ఈ విషయంలో గత సంవత్సరం
పరిస్తితి కొనసాగుతుంది. యాత్రీకులను ఎరుమేలి మీదుగా అటవీ మార్గంలోగానీ, పుల్మేడు మీదుగా సన్నిధానానికి గాని సాంప్రదాయ మార్గంలో అనుమతించరు. పంపా నదిలో స్నానం చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది.
యాత్రీకులు వచ్చే వారి వారి వాహనాలు నీలక్కల్ లో పార్క్ చేయడానికి మాత్రమే అనుమతించబడతాయి. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ బస్ లను మాత్రం పంపా వరకు అనుమతిస్తారు. దీనికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులను ఆదేశించారు.