1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (22:35 IST)

యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు

గుండె జబ్బులు వృద్ధాప్యంతో ముడిపడి ఉంటాయి అనేది పాత విషయం. ఇప్పుడు ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ఎన్నో తేడాలు వచ్చాయి. దీంతోపాటు తీరిక లేకుండా గడపడం, పని ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం వంటివి యువతలో గుండె జబ్బులకు కారణమవుతున్నాయి.
 
రక్తపోటు, గుండె జబ్బులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు వయసు మళ్లిన వారికే వస్తాయని చాలామంది భావిస్తారు. మలి వయసులో అవయవాల పనితీరు మందగించడం వల్ల వారికి వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో యువత కూడా ప్రమాదకరమైన, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

గుండె జబ్బులు వృద్ధాప్యంతో ముడిపడి ఉంటాయి అనేది పాత విషయం. ఇప్పుడు ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ఎన్నో తేడాలు వచ్చాయి. దీంతోపాటు తీరిక లేకుండా గడపడం, పని ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం వంటివి యువతలో గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తరువాత ఇలాంటి అనారోగ్యాల బారిన పడుతున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతోంది.
 
హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితి. గుండె శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తాన్ని సరఫరా చేయలేకపోవడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ లేదా గుండె వైఫల్యం అంటారు. గుండె పనితీరు దెబ్బతింటే శరీర కణాలకు తగినంత రక్తం సరఫరా కాదు. దీంతో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇవన్నీ గుండె వైఫల్యం లక్షణాలు. ధమనుల గోడలపై కొవ్వు నిల్వలు పెరగడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడేవారిలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీని వల్ల కూడా గుండె పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది.
 
గుండె జబ్బులకు కారణాలు
పొగతాగే అలవాటు ఉన్నవారు గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. అధిక రక్తపోటు, డయాబెటిస్, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె కవాటాలు దెబ్బతినడం వల్ల గుండె వైఫల్యం ఎదురవుతుంది. ఈ సమస్య ఉన్నవారు రోజువారీ పనులు కూడా సరిగ్గా చేసుకోలేరు. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా మారవచ్చు.

గుండె వైఫల్యాన్ని సరిచేయడం కష్టం. గుండె రక్తసరఫరా వ్యవస్థ బలహీనపడితే, సమస్య క్రమంగా పెరుగుతుంది. హార్మోన్లు, ఇతర వ్యవస్థలతో కలిసి దీన్ని సరిచేయడానికి శరీరం ప్రయత్నిస్తుంది. కానీ ఈ యంత్రాంగాలు విఫలమైతే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లవచ్చు.
 
ఎలా గుర్తించాలి?
గుండె వైఫల్యం నాలుగు దశల్లో ఎదురవుతుందని న్యూయార్క్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. ఒక్కో దశను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రారంభ దశలో జీవనశైలి, ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకోవడం, మందులు తీసుకోవడం వల్ల సమస్యను నివారించవచ్చు. కానీ ఆ తరువాతి దశల్లో ఈ జాగ్రత్తలు పనిచేయవు. సమస్య తీవ్రమైతే సర్జరీ చేయడం, ట్రాన్స్ ప్లాంట్, డివైజ్ ఇంప్లాంటేషన్ వంటివి అవసరమవుతాయి.
 
చికిత్స ఉందా?
ప్రస్తుతం దశలవారీగా గుండె వైఫల్యాన్ని నివారించేందుకు వివిధ పద్ధతులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. దీంతో సాధారణ జీవితం గడపవచ్చు. కానీ ఒక్కసారి వైఫల్యమైన గుండె ఇంతకుముందు మాదిరిగా పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయదు. అందువల్ల ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి, చికిత్స అందించాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అలవాట్లపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి.
 
ఆరోగ్యకరమైన బరువు, వ్యాయామాలు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినడం, పొగ, మద్యపానం అలవాట్లు మానేయడం, ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం... వంటివి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వీటిని ప్రతి ఒక్కరూ పాటించడం వల్ల గుండె వైఫల్యం, ఇతర గుండె సంబంధ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.