శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (14:21 IST)

నమ్మి సహజీవనం చేసిన యువతి... 35 ముక్కలు చేసిన కిరాతక ప్రియుడు...

murder
తనను నమ్మి సహజీవనం చేసేందుకు వచ్చిన ఓ యువతిని కిరాతక ప్రేమికుడు దారుణంగా హత్య చేశాడు. పైగా, ఆ యువతి శరీరాన్ని 35 ముక్కలు చేసి, 18 రోజుల పాటు రాత్రివేళ నిర్మానుష్య ప్రాంతంలో విసిరేసి మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేశాడు. యువతి తండ్రి ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు అరెస్టు చేయగా, అసలు విషయం బయటకు వచ్చింది. ఈ దారుణం ఢిల్లీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన అఫ్తాబ్ అమీన్ పునావాలా అనే వ్యక్తికి ఓ కాల్ సెంటరులో పని చేసే 26 యేళ్ళ శ్రద్ధా అనే యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరకు సహజీవనానికి దారితీస్తుంది. వీరిద్దరి బంధాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లి మెహ్‌రౌలీ అనే ప్రాంతంలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని నివసిస్తూ వచ్చారు. 
 
అయితే, వీరిద్దరి మధ్య పెళ్లి విషయంలో తరచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. ఆమెను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని అమీన్.. శ్రద్ధను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని 35 ముక్కలు చేసి వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. 18 రోజుల పాటు అర్థరాత్రి 2 గంటలకు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాటిని విసిరేసి మృతదేహం జాడలేకుండా చేశాడు. 
 
అయితే, తన కుమార్తెకు ఫోన్ చేసినా ఎంతకీ తీయకపోవడంతో మృతురాలి తండ్రికి అనుమానం ఈ నెల 8వ తేదీన శ్రద్ధ, అమీన్ నివసిస్తూ వచ్చిన ఇంటికి వెళ్లి చూడగా అది తాళం వేసివుంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అమీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. అమీన్ ఇచ్చిన సమాచారంతో మృతదేహం ఆనవాళ్లకోసం గాలిస్తున్నారు.