శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మార్చి 2023 (11:14 IST)

ప్రయాణ దూరం 21 కిలోమీటర్లు - ఉబర్ క్యాబ్ బిల్లు రూ.1525.. ఎక్కడ?

Uber
ఢిల్లీలో క్యాబ్ బుక్ చేసుకున్న ఓ మహిళకు ఉబెర్ క్యాబ్ సంస్థ తేరుకోలేని షాకిచ్చింది. 21 కిలోమీటర్ల ప్రయాణ దూరానికి ఏకంగా రూ.1525 ప్రయాణ చార్జీ వేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్ స్టేట్ చార్జ్, మున్సిపల్ కార్పొరేషన్ పన్నులు కూడా ఉండటం గమనార్హం. దీనిపై ఆ ప్రయాణికురాలు చేసిన ఫిర్యాదుతో నిద్రలేచిన ఉబర్ సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. జీపీఎస్ ఎర్రర్ కారణంగానే బిల్లు అలా వచ్చిందని వివరణ ఇచ్చింది. పైగా, రూ.900ను ఉబర్ క్యాష్ రూపంలో తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని తెలిపింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిత్తరంజన్ పార్కుకు వెళ్లేందుకు ఓ మహిళ ఉబర్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం సుమారుగా 21 కిలోమీటర్లు ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ గమ్యస్థానం చేరుకున్నాక బిల్లు రూ.1525 వచ్చిందని చెప్పాడు. ఈ మాట వినగానే షాక్‌కు గురైంది. అయితే, ఈ బిల్లు చెల్లించాల్సిందేనంటూ డ్రైవర్ పట్టుబట్టడంతో ఆమె డబ్బులు చెల్లించి, ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది.
 
జీపీఎస్ ట్రాకింగ్ సిష్టమ్ వల్ల తప్పు జరిగిందని, చెల్లించిన బిల్లులో రూ.900 రీఫండ్ చేస్తామని కంపెనీ ప్రతినిధులు సమాధానమిచ్చారు. అయితే, ఆ డబ్బులు ఆమె బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయకుండా ఉబర్ క్యాష్ కింద జమ చేసింది. అంటే ఆమె ఉబర్ రైడ్స్ సమయంలో మాత్రమే ఆ మొత్తాన్ని వాడుకునే వీలుంది. 
 
ఇక్కడ విచిత్రమేమిటంటే.. క్యాబ్ ఢిల్లీలో తిరగగా, బిల్లులో మాత్రం ఉత్తరప్రదేశ్ ఇంటర్ స్టేట్ చార్జ్, మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ కూడా రెండుసార్లు చొప్పున వేశారు. నిజానికి ఈ పన్ను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు మాత్రమే వేస్తారు. ఇక్కడ అవన్నీ కలిపి ఆమెకు వేసి షాకిచ్చారు.