శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2019 (07:04 IST)

జీరో నాలెడ్జ్ ఉన్నోళ్లు కూడా సీఎం కావాలనుకుంటే ఎలా? రాందాస్ అథవాలే

రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేనివాళ్లు అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్లు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే ఈ దేశం ఎక్కడికి పోతుందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. మహారాష్ట్రలో 50-50 ఫార్ములా ప్రకారం తమకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.
 
దీనిపై బీజేపీకి మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేకు ఎలాంటి అనుభవం లేదని... అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకోవడం మనందరికీ సిగ్గు చేటని అన్నారు.
 
బీజేపీకి చెందిన వ్యక్తే సీఎం కావాలని, దేవేంద్ర ఫడ్నవిస్‌కు సీఎంగా మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేనలు ఉన్న కూటమికి క్లియర్ మెజార్టీ వచ్చిందని... బీజేపీ శాసనసభాపక్ష నేతగా పడ్నవిస్‌ను ఎన్నుకున్నారని చెప్పారు. ఫడ్నవిస్ సీఎం కావాలని తాము కోరుకుంటున్నామన్నారు. మహారాష్ట్రకు ఐదేళ్ళపాటు ఒకే ముఖ్యమంత్రి ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. 
 
పైగా, బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని శివసేన గుర్తుంచుకోవాలని అథవాలే చెప్పారు. ఇతర పదవుల కోసం శివసేన డిమాండ్ చేయవచ్చని... ఆ పార్టీకి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చే అంశంపై బీజేపీ ఆలోచించాలని సూచించారు. మరో ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నట్టు ఫడ్నవిస్ ఇప్పటికే ప్రకటించారని... ఈ నేపథ్యంలో, శివసేన రాజీ పడాల్సిన అవసరం ఉందని రాందాస్ అథవాలే చెప్పుకొచ్చారు.