గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (17:58 IST)

వలస కార్మికుల హతం మా పనే.. యూఎల్ఎఫ్.. కాశ్మీర్‌ను వీడకపోతే?

కాశ్మీరీ వలసవాదులకు ప్రధాన మంత్రి ప్రత్యేక పథకం కింద ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం సహా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడంతో లోయకు వచ్చినవారు తిరిగి వెనుదిరుగుతున్నారు. 
 
మరోవైపు, ఉగ్రవాదులకు సహకరిస్తున్నవారిని, అనుమానితులను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 900 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పౌరులపై ఉగ్రదాడుల తర్వాత 13 మంది ముష్కరులను వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో హతమార్చారు.
 
జమ్మూ కశ్మీర్‌లో స్థానికేతరులపై ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో నలుగురిని హత్యచేశారు. శనివారం బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన వీధి వ్యాపారి, కార్పెంటర్‌ను హత్యచేసిన ఉగ్రవాదులు.. ఆదివారం బిహార్‌కు చెందిన మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. 
 
కుల్గాంలోని వాన్‌పోహ్‌ ప్రాంతంలో వలస కూలీలు అద్దెకు ఉంటున్న గదిలోకి చొరబడిన తీవ్రవాదులు.. విక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గాయపడ్డారు. దీంతో పది రోజుల్లోనే ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల సంఖ్య 11కు చేరింది. 
 
ఈ నేపథ్యంలో వలస కార్మికులపై ఘాతుకానికి పాల్పడింది తామేనని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ప్రకటించుకుంది. వలస కూలీలు వెంటనే కశ్మీర్ వదిలి వెళ్లిపోవాలని తాజాగా విడుదల చేసిన ఓ లేఖలో యూఎల్‌ఎఫ్‌ హెచ్చరించింది.