1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జులై 2022 (17:53 IST)

కేంద్ర మంత్రి నఖ్వీ రాజీనామా.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా?

Mukhtar Abbas Naqv
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన మంత్రిపదవికి బుధవారం రాజీనామా చేశారు. ఈయన ప్రస్తుతం బీజేపీలో కీలకమైన మైనార్టీ నేత. పైగా, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. వీరిద్దరి రాజ్యసభ పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే వారు మంత్రి పదవులు రాజీనామా చేశారు.
 
అయితే, నఖ్వీ రాజీనామాపై అనేక ఊహాగానాలను వ్యక్తమవుతున్నాయి. ఆయనను ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీయే అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నట్లు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయం నఖ్వీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
 
ఇటీవల భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో మైనార్టీ వర్గంలో కాషాయ పార్టీపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో నఖ్వీని ఉపరాష్ట్రపతి పదవికి బరిలో దించాలని ఎన్డీయేలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
 
అయితే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి రేసులో పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా నఖ్వీ పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూను ఎన్డీయే ఖరారు చేసిన విషయం తెలిసిందే.