ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

వందే భారత్ రైలు వేగం గంటకు సగటున 220 కిమీ...

vande bharat
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సెమీ హై స్పీడ్ రైళ్ళుగా భావించే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అయితే, వచ్చే రెండేళ్ళలో వందే భారత్ రైళ్ళలో అనేక మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను హై స్పీడ్ రైళ్ళ కేటగిరీ వేగాన్ని అందుకునే దిశగా మార్పులు చేయనున్నారు. 
 
ఈ మేరకు చెన్నైలోని ఐసీఎఫ్‌ నిపుణులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక్కడ తయారవుతున్న వందేభారత్‌ రైల్వే కోచ్‌ల సామర్థాన్నిపెంచేందుకు అవసరమైన సాంకేతికతపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వందేభారత్‌ రైళ్లు ట్రాక్‌ సామర్థ్యాన్ని బట్టి గంటకు 60 నుంచి 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. రానున్న రోజుల్లో నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే దిశగా.. వందేభారత్‌ రైళ్ల వేగాన్ని పెంచేందుకు చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో ప్రణాళికలు రచిస్తున్నారు. 
 
భవిష్యత్తులో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 200 నుంచి 220 కి.మీ.కు పెంచాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు రైల్వే బోర్డుతోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ వేగాన్ని అందుకోవాలంటే వందేభారత్‌ రైళ్లలో సామగ్రిపరంగా మార్పులు తీసుకురావాలి. ప్రస్తుతం ఈ రైళ్లకు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లోహాన్ని వాడుతున్నారు. హైస్పీడ్‌ వేగాన్ని అందుకోవాలంటే అల్యూమినియం లోహంతో వీటిని తయారు చేయాల్సి ఉంటుంది. ఇదంతా కార్యరూపం దాల్చడానికి, ప్రొటోటైప్‌ రైలు సిద్ధమవడానికి మరో రెండేళ్ల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. 
 
తర్వాత ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో ఈ వేగంతో రైళ్లను పరుగులు పెట్టించే అవకాశాలున్నాయి. దీనికి తగ్గట్లు సిగ్నలింగ్‌ వ్యవస్థలోనూ సాంకేతిక మార్పులు రానున్నాయి. భవిష్యత్తులో గంటకి 245 కి.మీ. వేగాన్ని అందుకునే సామర్థ్యంతో వందేభారత్‌ డిజైనింగ్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. కానీ పట్టాలపై మాత్రం దీని అత్యధిక వేగం గంటకు 220 కి.మీ.కు మించకుండా చేసే అవకాశముందని చెబుతున్నారు.