గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (12:02 IST)

ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్త.. కేసు పెట్టిన భార్య.. ముక్కు కోసిన మామ.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్‌లో ఓ ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. తనకు మూడు ముళ్ళ బంధాన్ని తెంచుకునేందుకు మూడు సార్లు తలాక్ చెప్పిన భర్తపై ఓ ముస్లిం మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని అత్తింటి వారు అమానుషంగా ప్రవర్తించారు. ముఖ్యంగా మామ ఆగ్రహంతో రగిలిపోతూ కేసుపెట్టిన కోడలిపై దాడి చేసి ఆమె ముక్కు కత్తితో కోసేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్‌లో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ ముస్లిం మహిళకు భర్త ఫోనులో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. దీంతో ఆవేదన చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఓపికగా ఎదురు చూసినప్పటికీ తన భర్తలో మార్పు రాలేదని, అతడి మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయాన్ని తెలుసుకున్న అత్తింటివారు కేసు వాపసు తీసుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అయితే బాధితురాలు ఇందుకు అంగీకరించకపోవడంతో తొలుత మాటలతో భయపెట్టారు. అయినప్పటికీ ఆమె లొంగకపోవడంతో ముక్కు కోసి అమానుషంగా ప్రవర్తించారు. 
 
కాగా ఈ కేసులో భార్యాభర్తల మధ్య సయోధ్య కుదుర్చడానికి గతంలో కౌన్సెలింగ్‌ ఇచ్చామని, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి ముక్కుపై తీవ్ర గాయాలు ఉన్నాయని.. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ట్రిపుల్‌ తలాక్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.