శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2023 (17:00 IST)

ఉత్తర కాశీలో కూలిన సొరంగం...40 మంది పరిస్థితి???

tunnel
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న ఓ సొరంగంలోని కొంతభాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ సొరంగంలో పని చేస్తున్న 40 మంది చిక్కుకుని వున్నట్టు సమాచారం. వీరి పరిస్థితి ఏమైందోనని ఆందోళనగా వుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యమునోత్రి జాతీయ రహదారిలో భాగంగా నిర్మాణ దశలో ఉన్న సొరంగంలో కొంత భాగం కూలిపోయింది. 
 
ఉత్తర కాశీ జిల్లలోని సిల్క్యారా నుంచి దండల్ గావ్ వరకు ఉన్న యమునోత్రి జాతీయ రహదారిలో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దాదాపు 40 మంది చిక్కుకున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. 
 
ఎసీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లా డీఎం, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే ప్రాణనష్టానికి అవకాశం లేదని కొట్టిపారేయలేమని అధికారులు పేర్కొన్నారు.
 
సొరంగం ప్రారంభ పాయింట్ నుంచి 200 మీటర్ల దూరంలో సొరంగం కూలిందని ఉత్తరకాశీ జిల్లా ఎస్పీ అర్పణ్ యదువంశీ వెల్లడించారు. నిర్మాణ పనులను నిర్వహిస్తున్న హెచ్ఐడీసీఎల్ అధికారులు ఈ వివరాలను వెల్లడించారని పేర్కొన్నారు. దాదాపు 40 మంది సొరంగంలో చిక్కుకుపోయారని, వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. త్వరలో చిక్కుకున్నవారిని సురక్షితంగా కాపాడుతామని అన్నారు.
 
ఇదిలావుండగా ఉత్తరాఖండ్‌లో ఈ యేడాది భారీగా వర్షాలు కురిశాయి. ఈ ప్రభావంతో భవనాలు, రోడ్లు, హైవేలపై ప్రమాదాల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో శివపురి ప్రాంతంలో వరద ప్రవాహం కారణంగా రిషికేశ్ - కర్ణప్రయాగ్ రైలు మార్గం ప్రాజెక్టులో భాగమైన 'ఎడిట్-2' అనే సొరంగంలో ఏకంగా 114 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే తాళ్ల సహాయంతో రెస్క్యూ బృందాలు వీరిని సురక్షితంగా కాపాడిన విషయం తెలిసిందే.