శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (10:21 IST)

అధికారం శాశ్వతం కాదు.. వేధింపులకు పాల్పడవద్దు : వెంకయ్య హితవు

venkaiah naidu
దేశంలోని పాలకులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ సూచన చేశారు. అక్రమార్జనకు, ప్రత్యర్థులను వేధించడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకోరాదని ఆయన హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. 
 
ఉమ్మడి ఏపీ మాజీ హోం మంత్రి టి.దేవేందర్ గౌడ్.. రాజ్యసభల్లో చేసిన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ బుధవారం జూబ్లీహిల్స్‌లో జరిగింది. ఇందులో వెంకయ్య నాయుడు నేటి రాజకీయ పరిస్థితులపై స్పందించారు. 
 
రాజకీయాల్లో అధికార, విపక్ష నేతలు ప్రత్యర్థులుగా ఉండాలనేగానీ శత్రువులుగా ఉండరాదన్నారు. ద్వేషపూరిత, కుట్రపూరిత రాజకీయాలు వద్దని కోరారు. ప్రజాతీర్పును, ప్రతిపక్షాలను గౌరవించాలన్నారు. కొందరు నోపు విప్పితే దుర్భాషలేనని, కర్త, కర్మ, క్రియ అన్నీ అసభ్య పదాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడేవారికి పోలింగ్ బూత్‌లలో ప్రజలు తమ ఓటు హక్కుతో సమాధానం చెప్పాలని కోరారు. 
 
తాను దివంగత మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డిపై ఎన్నో రకాలైన విమర్శలు చేసేవాడినని, అవన్ని కూడా విషయానికి లోబడే ఉండేవని, ఇపుడు ఆ స్థాయి విమర్శలను సహించే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్క పాలకుడు గుర్తుపెట్టుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.