బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (10:43 IST)

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పీఠంపై ఆదివాసీ నేత...

vishnu deo sai
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరో ఆదివాసీ నేతను భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 54 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విష్ణు దియో సాయిని కమలనాథులు ఎంపిక చేశారు. ఈ మేరకు ఆదివారం 54 మంది ఎమ్మెల్యేలతో జరిగిన పార్టీ శాసనసభా పక్ష నేత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ఓ గిరిజన నేతను సీఎం చేయాలన్న నరేంద్ర మోడీ సంకల్పం ప్రకారం సీఎం ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
వివాదరహితుడిగా పేరున్న విష్ణుదియో సాయి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2020-22 మధ్యకాలంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారు. పార్టీ నిర్వహణపై మంచి పట్టున్న వ్యక్తిగా పేరుపొందారు. బీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయనను ప్రధాని నరేంద్ర మోడీ 2014లో జూనియర్ మినిస్టర్‌గా కూడా నియమించారు. 
 
నిజానికి కొత్త సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంపై కమలనాథులు ఫలితాలు వెల్లడైన వారం రోజుల పాటు తర్జనభర్జనలు పడ్డారు. గిరిజన నేతను సీఎం చేయాలా లేక ఓబీసీ నేతకు ఈ అవకాశం ఇవ్వాలా అన్న విషయంలో పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. మాజీ సీఎం రమణ్ సింగ్ అండదండలతో పాటూ ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉండటంతో చివరకు విష్ణు పేరు సీఎంగా ఖరారైంది.
 
విష్ణు దియో సాయిను సీఎం చేసే అవకాశం ఉందని ఎన్నికల సమయంలోనే హోం మంత్రి అమిత్ షా సంకేతాలిచ్చారు. కుంకురి నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 'మీరు సాయిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మేము ఆయనను ఇంకా పెద్ద వ్యక్తిని చేస్తాం' అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనులకు బీజేపీ అనుకూలంగా మారింది. మునుపెన్నడూ చూడని రీతిలో.. గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న సుర్గుజా ప్రాంతంలో ఉన్న 14 సీట్లు, బస్తర్ ప్రాంతంలోని 12 సీట్లు గెలుచుకుంది. దీంతో, విష్ణు దియో సాయికి సీఎం కుర్చీ దక్కింది. కాగా, అజిత్ జోగి తర్వాత రెండో ఆదివాసీ నేత ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు.