తూర్పు గోదావరిలో కరోనా కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి పాజిటివ్
తూర్పు గోదావరిలో కరోనా కలకలం రేపింది. తూర్పు గోదావరి తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ఓ ఇంట్లో నిర్వహించిన భజనలో మరో నాలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. వీరిలో కొందరికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 21 మందికి పాజిటివ్ అని తేలింది. వారి కుటుంబసభ్యులకు చికిత్స అందిస్తున్నారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ 21 మందికి సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇంతమందికి వైరస్ సోకడంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు.
రాజమహేంద్రవరంలో కూడా కరోనా కేసులు కలకలం రేపాయి. ఓ ప్రైవేట్ కాలేజీలో ఏకంగా 163 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి వరుసగా 13, 10 చొప్పున కేసులు నమోదు అవుతుండగా.. సోమవారం ఒక్క రోజే 140 మందికి వైరస్ సోకిందని తేలింది. 700 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారిని ఒకే చోట ఉంచి ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా చేశారు. నెగెటివ్ వచ్చిన దాదాపు 450 మందిని వేరే హాస్టల్‌లో ఉంచారు. వీరిలో 163 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.