ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (08:29 IST)

ఆ 34 లక్షల కరోనా కేసులు ఏమయ్యాయి?

లెక్కల్లోకి రాని కరోనా కేసులెన్నో మన చుట్టూ తిరుగుతున్నాయా?... ఆ విషయం ప్రభుత్వాలకు కూడా తెలిసీ మిన్నకుండిపోయాయా?.. ఇప్పుడు అదే పెద్ద ముప్పుకు దారి తీసే అవకాశముందా?... అవుననే అంటున్నారు వైద్య నిపుణులు...

దేశంలో కరోనా కేసులు కోటికి దగ్గరకు చేరువయ్యాయి. ఇప్పటికే 92 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కాగా, తాజా నివేదికల ప్రకారం 34 లక్షల కేసులు లెక్కలోకి రాలేదని తేలింది. అయితే తొలినుండి పలువురు శాస్త్రవేత్తలు ఇంకా కేసులు ఎక్కువగానే ఉండవచ్చునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

స్క్రీనింగ్‌ టెస్ట్‌ల సంఖ్య భారత్‌ తగ్గించడం వల్ల ఇవి లెక్కలోకి రాలేదు. రెండవది యాంటిజెన్‌ పరీక్షల సంఖ్యను పెంచడం, పిసిఆర్‌ పరీక్షల సంఖ్యను తగ్గించటం.
 
ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ కూడా యాంటిజెన్‌ పరీక్షలు కోవిడ్‌ ఉన్నట్లు నిర్ధారించలేవు. తక్కువ వైరస్‌ లక్షణాలు వున్న వ్యక్తులకు స్క్రీనింగ్‌లో ఏమీ తెలియడం లేదు. అదేవిధంగా రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు (రాట్‌) అధిక సంఖ్యలో తప్పుడు నివేదికలు ఇచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగానే కరోనా వాస్తవ లెక్కలు తేలలేదు. 

పిసిఆర్‌ వర్సెస్‌ యాంటిజెన్‌ ఫలితాలపై కొన్ని రాష్ట్రాలు మాత్రమే నివేదించిన డేటా ప్రకారము...కరోనా ఫలితాన్ని తేల్చడంలో పిసిఆర్‌ పరీక్షలు మెరుగ్గా ఉన్నాయని తేలింది. యాంటిజెన్‌ పరీక్షల కన్నా పిసిఆర్‌ పాజిటివిటీ రేటు 2.5-3.5 రెట్లు సత్ఫలితాన్నిస్తున్నాయి.

ఢిల్లీలో పిసిఆర్‌ టెస్ట్‌ల పాజిటివిటి రేటు 14 శాతం ఉండగా, యాంటి జెన్‌ పరీక్షలు 4 శాతం మాత్రమే. కరోనా వచ్చిన తొలినాళ్లలో 100 శాతం పిసిఆర్‌ పరీక్షల ద్వారానే రోగ నిర్ధారణ జరగ్గా..ఇప్పుడు వాటి సంఖ్యను 60 శాతానికి పడిపోయింది. అదే సమయంలో యాంటిజెన్‌ పరీక్షల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

ఈ ఏడు నెలల కాలంలో ఆ పరీక్షల సంఖ్య 5.5 కోట్లకు చేరింది. అంటే ఇప్పటి వరకు జరిగిన మొత్తం పరీక్షల్లో 40 శాతమన్నమాట. దీని ప్రకారము... కోవిడ్‌ వచ్చిన వారికి సరైన ఫలితాలు కూడా వచ్చి ఉండకపోవచ్చు అన్న అభిప్రాయము ఏర్పడుతుంది.