ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 జులై 2021 (09:11 IST)

ఎవరీ బసవరాజ్ బొమ్మై?

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మైను బీజేపీ ఎంపిక చేసింది. పార్టీ శాసనాసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాజీనామా చేసిన కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బసవరాజ్ గురించి ఒకసారి పరిశీలిస్తే..
 
బసవరాజ్ తండ్రి ఎస్. ఆర్. బొమ్మై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. గతంలో జలవనరుల శాఖా మంత్రిగా కూడా బసవరాజ్ సేవలందించారు. ఈసారి యడియూరప్ప కేబినెట్‌లో హోంమంత్రిగా ఉన్నారు. ఇంజినీరింగ్ చదువుకున్న ఆయన టాటా గ్రూప్‌లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి హావేరి జిల్లాలోని షిగ్గాన్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయభేరి మోగించారు. ఇప్పుడు కర్ణాటక కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 
 
సుమారు 32 సంవత్సరాల క్రితం బసవరాజ్ తండ్రి ఎస్.ఆర్. బొమ్మై కొంతకాలం కర్ణాటక సీఎంగా సేవలందించారు. మళ్లీ ఇన్నాళ్లకు బసవరాజ్ సీఎం కుర్చీ ఎక్కబోతున్నారు. తొలుత జనతాదళ్ (యూ)లో ఉన్న బసవరాజ్.. 22 మందితో కలిసి 2008లో బీజేపీలో చేరారు.

ఆ తర్వాత యడియూరప్పకు దగ్గరయ్యారు. ఈయన కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే. అలాగే ఈయన పేరులోని ‘బసవ’ అనే పదం ఈ వర్గాన్ని 12వ శతాబ్దంలో స్థాపించిన బసవేశ్వరుడిని సూచిస్తుందట.
 
బసవరాజ్‌ను సీఎంగా ఎంపిక చేసిన శాసనసభాపక్ష సమావేశానికి పరిశీలకులుగా బీజేపీ అధిష్ఠానం నియమించిన కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రదాన్‌తోపాటు కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇంచార్జి అరుణ్ సింగ్, ఆపదర్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్ప కూడా హాజరయ్యారు. బొమ్మై ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్‌లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.