అవునా.. పాక్ సైన్యం అభినందన్‌ను మానసికంగా వేధింపులకు గురిచేసిందా?

Abhinandan
Last Updated: శనివారం, 2 మార్చి 2019 (19:55 IST)
పాకిస్థాన్ చెర నుంచి స్వదేశానికి చేరుకున్న వింగ్ కమాండర్ అభినందన్‌కు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న అభినందన్‌ను నేరుగా ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు తరలించారు. అక్కడ వింగ్ కమాండర్ అభినందన్‌కు 'కూలింగ్ డౌన్' ప్రక్రియలో భాగంగా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆదివారం కూడా మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వాయుసేన అధికారులు తెలిపారు. 
 
విమానంతో దాడికి బయల్దేరినప్పటి నుంచి తిరిగి వాఘా బోర్డర్ ద్వారా భారత్‌కు చేరుకునే వరకు అసలేం జరిగింది అనే విషయాలను అభినందన్‌ను అడిగి తెలుసుకుంటారని వాయుసేన ఉన్నతాధికారులు తెలిపారు. ఇక శనివారం ఉదయాన్నే తన కుటుంబ సభ్యులను కలుసుకున్న అభినందన్ వారి యోగక్షేమాలను తెలుసుకున్నాడు. 
 
అలాగే శనివారం రక్షణ మంత్రి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో ఉన్న అభినందన్‌ను కలిసి పరామర్శించారు. విమానం నుంచి ల్యాండ్ అయిన పరిస్థితులు, పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. 
 
మరోవైపు పాకిస్థాన్ సైనికుల ఆధీనంలో ఉన్న సమయంలో అభినందన్ తీవ్ర మానసిక వేధింపులకు గురైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని ఏఎన్ఐ వెల్లడించింది. పాక్ సైనికులు తనను భౌతికంగా హింసించనప్పటికీ, మానసికంగా వేధించారని అభినందన్ తెలిపినట్టు సమాచారం.
 
ఇదిలా ఉంటే.. అభినందన్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌లో అభినందన్ అంటే ఇప్పటి వరకు స్వాగతం అని అర్థమని... ఇప్పుడు దాని అర్థం మారిందని ప్రధాని మోదీ అన్నారు. ''భారత్ అంటే ఏమిటో ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్తగా అర్థం చేసుకుంటోంది. డిక్షనరీలోని పదాల అర్థాలను సైతం మనం మార్చేస్తున్నాం'' అంటూ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ను ఉద్దేశించి మోదీ ప్రశంసలు గుప్పించారు. దీనిపై మరింత చదవండి :