మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By
Last Updated : శుక్రవారం, 12 అక్టోబరు 2018 (11:02 IST)

నవరాత్రి దేవి.. శ్రీ కృష్ణుడిచే పూజలందుకున్నదా?

శ్రీ కృష్ణ పరమాత్మ చేత తొలుత నవరాత్రి దేవి పూజలందుకుంది. గోకులం, బృందావనంలో నవదుర్గ పూజలందుకున్నట్లు పండితులు చెప్తున్నారు.

శ్రీ కృష్ణ పరమాత్మ చేత తొలుత నవరాత్రి దేవి పూజలందుకుంది. గోకులం, బృందావనంలో నవదుర్గ పూజలందుకున్నట్లు పండితులు చెప్తున్నారు. "బ్రహ్మ"కైటభుల బారి నుండి రక్షణకై ఈమెను కృష్ణుడు స్తుతించి విముక్తి పొందినాడు. "పరమేశ్వరుడు" త్రిపురాసుర సంహార సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం సాధించాడు. 
 
దేవేంద్రుడు.. దుర్వాసుని శాపం వల్ల సంపదలను కోల్పోగా, పరాశక్తిని సేవించి తిరిగి సంపదలను పొందగలిగినాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధి, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవీ కటాక్ష పాత్రులవుతున్నారు. నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధనతో జ్ఞానాన్ని పొందాలని పండితులు చెప్తున్నారు. 
 
ఈ నవరాత్రి ఉత్సవాలలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను చేసిందట. ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు.
 
ఇలా నవరాత్రులు జరుపుకుని ఒక విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో.. 
 
శ్లో శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ అని స్మరించి.. ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. శ్రీరామచంద్రుడు విజయదశమి, విజయ కాలమందు ఈ శమీపూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించడం ద్వారా శమీవృక్షము, 'రామస్య ప్రియదర్శిని' అయినది చెప్తుంటారు. 
 
అందుకే అసాధ్యాలను సుసాధ్యం చేయాలన్నా.. సర్వదుఃఖాలు తొలగిపోవాలన్నా.. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు చేకూరాలన్నా.. నవరాత్రుల్లో ఆ దేవదేవికి పూజలతోపాటు శ్రీలలితాసహస్రనామ పారాయణలు నిత్యమూ గావించి ఆ జగన్మాత కృపాకటాక్షాలు పొందాలని పండితులు చెప్తున్నారు.