మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 22 జనవరి 2019 (19:07 IST)

నోరూరించే చేపల బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...

మాంసాహార ప్రియులు నోరూరించే చేపల కూర అంటే అమితంగా ఇష్టపడతారు. అదే చేపల బిర్యానీ అంటే... లొట్టలెయ్యాలసిందే మరి. ఆరోగ్యపరంగా చూసినా చేపలలో అనేక రకములైన పోషకాలు ఉన్నాయి. చేపలలో కాల్షియం, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటాయి. చేపలను తినడం వలన ఎముకలకు బలం, కంటిచూపు మెరుగుపడుతుంది. మరి చేపల బిర్యానీ ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు :
బాస్మతిబియ్యం- అరకిలో,
బిర్యానీ దినుసులు- తగినన్ని,
చేపముక్కలు- ముప్పావుకిలో,
నూనె- వంద గ్రాములు,
టొమాటోలు- నాలుగు,
ఉల్లిపాయలు- నాలుగు,
అల్లంవెల్లుల్లి- 2 టేబుల్ స్పూన్లు,
నిమ్మరసం- టేబుల్ స్పూను,
పెరుగు- గిలకొట్టినది కప్పు,
పచ్చిమిర్చి- పది,
కొత్తిమీర- ఒక కట్ట,
ఉప్పు- తగినంత,
 
తయారీ విధానం... 
చేప ముక్కల్ని శుభ్రంగా కడగాలి. తరువాత అందులో సగం పెరుగు, అల్లం, వెల్లుల్లి, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ముక్కలకు పట్టించి పక్కన ఉంచాలి. బియ్యం కడిగి అరగంట సేపు నాననివ్వాలి. నానబెట్టిన బియ్యంలో ఉప్పు, బిర్యానీ దినుసులు, తగినన్ని నీళ్లు పోసి కాస్త పలుకు ఉండేలా ఉడికించి దించాలి.
 
మరో బాణాలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. టొమాటో ముక్కలు, మిగిలిన పెరుగు, కాస్త ఉప్పు వేసి కలుపుతూ ఐదు నిమిషములు వేయించాలి. మసాలా పట్టించిన చేప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం మంట మీద వేసి ఉడికించాలి.
 
ఇప్పుడు పాన్‌లో అడుగున కాస్త నూనె వేసి ఉడికించిన అన్నం కొద్దిగా పరిచి దాని మీద కాస్త చేపలకూర, కాస్త కొత్తిమీర తురుము, వేయించి ఉంచిన కాసిని ఉల్లి ముక్కలు చల్లాలి. దానిమీద మళ్లీ అన్నం పరిచి మిగిలిన కూర మిశ్రమం, కొత్తిమీర తురుము, వేయించి ఉంచిన ఉల్లిముక్కలు చల్లాలి. దాని మీద మిగిలిన అన్నం వేసేసి కొత్తిమీర వేసి మూత పెట్టి సిమ్‌లో ఆవిరి పోకుండా పావుగంట సేపు ఉడికించి దించాలి. అంతే.. నోరూరించే చేపల బిర్యానీ రెడీ.