బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 25 జూన్ 2015 (17:40 IST)

20వ తానా మహా సభలు 2015 జులై 2,3,4 తేదీలలో...

తానా మహా సభల కార్యక్రమాల కమిటీ, 20 వ తానా మహా సభలు జయప్రదం చెయ్యడానికి విశేష కృషి చేస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో సమీక్షలు, ప్రణాళికాబధ్ధ కార్యక్రమాలు, వివిధ కమిటీల వారు నిర్వహిస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగు సూచనలిస్తున్నారు. వివిధ కమిటీలను సమన్వయం చేస్తూ సభా కార్యక్రమల ఏర్పాట్లకు అన్ని చర్యలూ చేపడుతున్నారు. 
 
ఈ కమిటీ అధ్యక్షులు రవి చెరుకూరి, శ్రీనివాస్ వంకాయలపాటి, పున్నయ్య చెరుకూరి, వెంకట్ వెనిగళ్ళ కో-చైర్స్ ఈ బృందంగా ఏర్పడి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కమిటీ వారు ఇప్పటికే సభా నిర్వహణకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వచ్చి, వివిధ కమిటీల వారికి దశ, దిశ నిర్దేశిస్తున్నారు. ధీంతాన, జాతీయస్థాయిలో క్రీడల పోటీలు తానా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా నిర్వహించి మహాసభలకు ప్రేరణ, ఉత్తేజం కలిగించారు. ఆయా కమీటీలకు మార్గదర్శకులుగా నిలిచారు.
 
అంకితభావంతో పనిచేస్తున్న కమిటీల వారికి సభా కార్యక్రమాల కమిటీ వారు అన్ని విధాలుగా చేయూతనిస్తున్నారు. సభా మందిరాల అలంకరణ, ప్రధాన వేదిక, ధీంతాన వేదిక, భోజన శాల, ప్రత్యేక భోజన ఏర్పాట్లు, అతిథులకు వసతి సౌకర్యాలు, మహిళల ఫోరం, వ్యవసాయ వేదిక, సాహితీ సమావేశాలు, యువతీయువకుల కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహింపబడడానికి కృషి చేస్తున్నారు. 
 
కమిటీ అధ్యక్షులు రవి చెరుకూరి సేవలు ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ విషయం. గతంలో డిట్రాయిట్లో జరిగిన తానా మహా సభల అనుభవాలతో, 20వ తానా మహా సభలను తానా చరిత్రలో గర్వకారణంగా నిలిచే దిశలో కృషి చేస్తున్నారు. వీరు చేస్తున్న కృషికి, కమిటీ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసాపాత్రం.
 
ఏ కార్యక్రమం జయప్రదంగా జరగాలన్నా సమగ్ర ప్రణాళికను రూపొందించడం, దాన్ని విజయవంతంగా అమలు చెయ్యడం చాలా అవసరం. అన్ని కమిటీల వారిని కార్యవర్గాన్ని సంఘటిత పరుస్తూ సేవాభావంతో ముందుకు వెళుతున్న ఈ కమిటీ 20వ తానా మహాసభలు జయప్రదంగా నిర్వహింపబడడానికి ఒక ప్రధాన సాధనమవ్వాలని ఆకాంక్షిద్దాం.