పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు
భారత ప్రభుత్వం దువ్వూరి నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. వైద్య రంగంలో నాగేశ్వర రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని అంతర్జాతీయంగా కూడా నాగేశ్వరరెడ్డి గుర్తింపు తెచ్చుకుని తెలుగువారందరికి గర్వకారణంగా నిలిచారని నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే నందమూరి బాలకృష్ణ.. నటుడిగా, ప్రజా ప్రతినిధిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సమాజ సేవకుడిగా చేస్తున్న పనులకు పద్మభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించడం అభినందనీయమని తెలిపారు.
కళారంగం నుంచి ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, సాహిత్యం విద్యారంగం నుంచి కె.ఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, సామాజిక రంగం నుంచి మందకృష్ణ మాదిగ లకు పద్మ పురస్కారాలు వరించడంపై అమెరికాలో ఉండే తెలుగు వారందరికి సంతోషంగా ఉందన్నారు. పద్మ పురస్కారాలు సాధించిన తెలుగువారికి అమెరికాలో ఉండే తెలుగువారి తరపున నాట్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.