ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ
తనకు ప్రద్మభూషణ్ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి, ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
తన ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.
తన తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు నుండి ఆయన వారసుడిగా నేటి వరకు తన వెన్నంటి ఉండి తనను ప్రోత్సహిస్తున్న తన అభిమానులకు, తనపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉండగలనని తెలియజేస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. అప్పుడు... ఇప్పుడు... ఎల్లప్పుడూ... సదా మీ నందమూరి బాలకృష్ణ అని పేర్కొన్నారు.