1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 మే 2022 (19:54 IST)

ఆటిజంపై నాట్స్ వెబినార్‌కు చక్కటి స్పందన: ఆటిజంపై అవగాహన కల్పించిన నాట్స్

NATs event
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆటిజం మీద వెబినార్ నిర్వహించింది. ఆటిజం బాధితులు ఎలా ఉంటారు.? చిన్నారుల్లో ఆటిజాన్ని ఎలా గుర్తించాలి..? వారి పట్ల ఎలా వ్యవహరించాలి..? వారికి ఎలాంటి మద్దతు అందించాలి..? చికిత్స ఎలా ఉంటుంది.? ఇలా ఆటిజం గురించి అనేక అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించేలా ఈ వెబినార్ సాగింది.

 
ఈ ఆటిజం సదస్సులో వర్జీనియా ఆటిజం అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు, పిల్లల వైద్య నిపుణుడు కృష్ణ మాదిరాజు, పిల్లల మనో వికాస వైద్య నిఫుణులు కవిత అరోరా, మీనాక్షి చింతపల్లి, పిల్లల మానసిక వైద్య నిపుణులు రామ్ ప్రయాగ, పేరంట్ అడ్వకేట్స్ శుభ బొలిశెట్టి, రాధ కాశీనాథుని పాల్గొన్నారు. ఆటిజాన్ని ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలనే విషయాన్ని కృష్ణ మాదిరాజు చక్కగా వివరించారు. ఆటిజంలో ఉండే లక్షణాలను ఆయన స్పష్టంగా వీక్షకులకు తెలిపారు.

 
ఆటిజం పిల్లలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని కృష్ణ మాదిరాజు స్పష్టం చేశారు. ఆటిజం సమస్య తమ పిల్లలకు ఉందని తెలిసినప్పుడు తల్లిదండ్రులు కృంగిపోకుండా దైర్యంగా ఉండి.. ఆటిజం చికిత్స విధానాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. వైద్యుల సలహాలతో ఆటిజం నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలని కవిత అరోరా అన్నారు. ఆటిజం చికిత్స విధానాలపై కూడా ఈ వెబినార్‌లో ప్రముఖ వైద్యులు మీనాక్షి చింతపల్లి, రామ్ ప్రయాగ అవగాహన కల్పించారు.

 
ఆటిజం సమస్యతో ఉన్న తమ వారిని తాము ఎలాంటి మార్గాలను అవలంభించి ఆ సమస్యను అధిగమించేలా చేశామనేది పేరెంట్స్ అడ్వకేట్స్ శుభ బొలిశెట్టి, రాధ కాశీనాథుని వివరించారు. ఆటిజం పిల్లల్లో ఉండే ప్రతిభను కూడా వెలికి తీసేలా తల్లిదండ్రులు వ్యవహరించాలని సూచించారు. ప్రముఖ వైరాలజీ వైద్యులు పద్మజ యలమంచిలి ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించారు.

 
నాట్స్ ఆశయాలు, లక్ష్యాల గురించి ఈ వెబినార్‌లో నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి వివరించారు. ఈ కార్యక్రమానికి జ్యోతి వనం కూడా అనుసంధానకర్తగా వ్యవహరించి తన వంతు తోడ్పాటు అందించారు. ఇంకా జయశ్రీ పెద్దిభొట్ల, ఉమ మాకం ఆటిజంపై ఇంత చక్కటి వెబినార్ నిర్వహించినందుకు నెటిజన్లు నాట్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వెబినార్ టెక్నికల్ సహకారం సుధీర్ మిక్కిలినేని, లక్ష్మి బొజ్జ అందించారు.