గవ్వలు లక్ష్మీదేవికి ఏమౌతాయి.. పసుపు వస్త్రంలో..? (video)
గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీదేవి చెల్లెల్లు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడా ఉంటాయి. శివుని జటాజూటంలోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి.
కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టి దోషం లేకుండా చేసుకునే సాంప్రదాయంగా వస్తోంది. గృహ నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. కొత్తగా ఇళ్ళు గృహ ప్రవేశం చేసే వారు గుమ్మానికి గుడ్డలో గవ్వలను కడతారు. అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో పెట్టి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుందని ఓ విశ్వాసం. వ్యాపారులు గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులకు తగులుతూ వుంచడం ద్వారా ధనాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం.
వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి. వివాహ సమయములలో వధూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుందని కొన్ని ప్రాంతాల వారు విశ్వసిస్తారు.