మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (14:19 IST)

శుభప్రదమైన మాసం.. నోములు, వ్రతాలతో సందడే సందడి..

శ్రావణ మాసం శుభప్రదమైన మాసం. ఈ మాసంలో శుభకార్యాలను నిర్వహించేందుకు ముహూర్తాలు కుదుర్చుకుంటారు. వ్రతాలు, నోములు చేపడతారు. తెలుగు మాసాల్లో ఐదో మాసమైన శ్రావణం ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ వరకు వుంట

శ్రావణ మాసం శుభప్రదమైన మాసం. ఈ మాసంలో శుభకార్యాలను నిర్వహించేందుకు ముహూర్తాలు కుదుర్చుకుంటారు. వ్రతాలు, నోములు చేపడతారు. తెలుగు మాసాల్లో ఐదో మాసమైన శ్రావణం ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ వరకు వుంటుంది. ఈ మాసంలో తెలుగు ప్రజలు మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మిని, గౌరీదేవీని ప్రత్యేకంగా పూజిస్తారు. 
 
నోములకు, పేరంటాలకు ఈ మాసం సుప్రసిద్ధం. ఈ నెలలో నోములు నోచే మహిళలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. పసుపు పాదాలతో, శనగ వాయినాలతో శ్రావణమాసం ప్రతిరోజూ ఓ పండుగలా సాగిపోతుంది. ఈ ఆదివారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతోంది. 
 
చాంద్రమానం ప్రకారం శ్రావణ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు. శ్రావణమాసంతో వర్షరుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తులలో స్థితికారుడు, దుష్టశిక్షకుడు శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసమిది.  శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం.
 
శ్రావణమాసంలో మాత్రం మంగళ, శుక్ర, శనివారాలు మహత్తు కలిగినవి. శ్రావణంలో మంగళవారాల్లో గౌరీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని, శనివారాల్లో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు. మాసం మొదటి తిథి అయిన పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉండే పదిహేను రోజులనూ శుక్లపక్షం అంటారు. ఇవి ఎంతో విశేషమైనవి. ఒక్కోరోజు ఒక్కోదేవుని పూజించాలని, పవిత్రారోపణోత్సవాలు చేయాలని పురాణాలు చెప్తున్నాయి. 
 
శుక్లపక్షంలోని పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు దేవతలను వరుసగా పూజించాలి. పాడ్యమి-బ్రహ్మదేవుడు, విదియ- శ్రియఃపతి, తదియ-పార్వతీదేవి, చవితి- వినాయకుడు, పంచమి-చంద్రుడు, షష్ఠి- కుమారస్వామి, సప్తమి-సూర్యుడు, అష్టమి- దుర్గాదేవి, నవమి-మాత దేవతలు, దశమి- యమధర్మరాజు, ఏకాదశి-మహర్షులు, ద్వాదశి -శ్రీమహావిష్ణువు, త్రయోదశి-మన్మథుడు, చతుర్దశి -శివుడు, పూర్ణిమ-పితృ దేవతలు... ఈ విధంగా శుక్లపక్షంలోని ఒక్కోరోజుకు ఒక్కోదేవతను పూజించడం వల్ల సంవత్సరంలో చేసే పూజలన్నీ పవిత్రమవుతాయంటారు. 
 
ఇలా పూజించిన వారికి ఎలాంటి సమస్యలు రావని, ఆర్థికాభివృద్ధి వుంటుందని, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు అంటున్నారు. శ్రావణ మాసంలోని మంగళవారాల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు మంగళగౌరీ వ్రతం చేస్తారు. అయిదేళ్లపాటు కొనసాగించే మంగళగౌరీ వ్రతం సౌభాగ్యాన్ని వృద్ధి చేస్తుందని నమ్ముతారు. 
 
ఇంకా పౌర్ణమి తరువాత వచ్చే శుక్రవారం నాడు స్త్రీలందరూ వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. అలాగే కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శ్రావణమాసం అతిముఖ్యమైనది. వేంకటేశ్వరుని వద్ద శ్రావణంలోని ఏదో ఒక శనివారం నాడు పిండి దీపారాధన చేస్తారు. 
 
బియ్యపు పిండి, నెయ్యి, బెల్లం లేదా చక్కెర కలిపి చలిమిడిలా సిద్ధం చేసుకోవాలి. దానిని ప్రమిదలా నొక్కి తయారు చేసుకుని ఆవునెయ్యి పోసి దీపాలు వెలిగించాలి. శ్రీవేంకటేశ్వరుని శక్తికొద్దీ పూజించి నైవేద్యం సమర్పించాలి. దీపం కొండెక్కిన తరువాత చలిమిడిని ప్రసాదంగా స్వీకరించాలి. కాబట్టి శ్రావణ మాసంలో పూజలు, నోములు, వ్రతాలను ఆచరించి విశేష ఫలితాలను పొందండి.