హనుమంతునికి వడమాల సమర్పిస్తే.. రాహుగ్రహ దోషం పోయినట్లే... ఎందుకంటే...?
హనుమంతుని పూజ భక్తులను గ్రహ బాధల నుండి దూరం చేస్తుంది. శని సైతం హనుమంతుని ముందు నిలువలేడు. వ్యక్తులను ఇబ్బందులు పెట్టే గ్రహాలలో రాహువు ఒకటి. ఐతే హనుమంతుని పూజతో రాహు గ్రహ దోషాల నుండి కూడా భక్తులు విము
హనుమంతుని పూజ భక్తులను గ్రహ బాధల నుండి దూరం చేస్తుంది. శని సైతం హనుమంతుని ముందు నిలువలేడు. వ్యక్తులను ఇబ్బందులు పెట్టే గ్రహాలలో రాహువు ఒకటి. ఐతే హనుమంతుని పూజతో రాహు గ్రహ దోషాల నుండి కూడా భక్తులు విముక్తులవుతారని ఒక కథ ప్రచారంలో ఉంది. అంజనాదేవికి, వాయు భగవానునికి జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో అకాశంలో ఉన్న సూర్యుడిని పండుగా భావించి ఎగిరి పట్టుకోవాలనుకున్నాడు.
వాయుపుత్రుడు కావడంతో అకాశానికి రువ్వున ఎగిరాడు. సూర్యుడిని పట్టుకునేందుకు వాయుపుత్రుడు ఇలా ఆకాశానికి ఎగిరెళ్ళడం చూసిన దేవతలంతా విస్తుపోయారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసిరి ఆంజనేయుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అలా వజ్రాయుధం హనుమంతుడి దవడ తాకింది. తద్వారా హనుమంతుని దవడ గాయమేర్పడి కుంచించుకుపోయింది. అందుచేత సుందరుడు అనే పేరుగల ఆంజనేయుడు హనుమంతునిగా పిలువబడెను.
బాల హనుమంతుడు సూర్యుడిని పట్టేందుకు వెళ్తున్న సమయం సూర్యగ్రహణం కావడంతో, సూర్యుడిని పట్టుకునేందుకు రాహువు కూడా ప్రయాణమయ్యాడు. అయితే వాయుపుత్రుని వేగానికి ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ కారణంతో సూర్యుడిని రాహువు పట్టలేకపోయాడు. సూర్యగ్రహణాన్ని అడ్డుకొని వేగంతో తనను మించిన హనుమంతుడి సాహసాన్ని చూసి నివ్వెరపోయిన రాహువు ఆంజనేయుడికి ఒక వరం ప్రసాదించాడు.
ఆ వరం ఏమిటంటే.. రాహువుకు ప్రీతికరమైన ధాన్యమైన మినుములతో గారెలు చేసి వాటిని మాలలాగా తయారుచేసి ఎవరు హనుమంతునికి సమర్పిస్తారో వారికి రాహుగ్రహంతో ఏర్పడే బాధలు, దోషాల నుండి విముక్తుల్ని చేస్తానని, వారిని ఎప్పటికీ ముట్టబోనని వరమిచ్చి ఆశీర్వదిస్తాడు. రాహువుకు ప్రీతికరమైన మినుముతో గారెలు చేసి తన శరీరం పోలిక అంటే పాములాంటి ఆకారంలో మాలగా వడలను ఆంజనేయునికి సమర్పిస్తే, రాహు దోషాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం. అందుచేతనే మినప పప్పుతో కూడిన గారెలను తయారుచేసి 54, 108 లేదా 1008 అనే సంఖ్యలో హనుమంతునికి మాలగా సమర్పించిన వారికి రాహు దోషాలుండవని పంచాంగ నిపుణులు చెబుతుంటారు.