మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:06 IST)

తిరుమలలో నూతన పరకామణి, భక్తులు నేరుగా లెక్కేయడం చూడొచ్చు

తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం ఎదురుగా నిర్మించ‌నున్న నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నానికి శుక్ర‌వారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, దాత శ్రీ ముర‌ళీకృష్ణ‌తో క‌లిసి భూమిపూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ... శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌ను లెక్కించే కార్య‌క్ర‌మాన్ని ప‌ర‌కామ‌ణి అంటారని చెప్పారు. హుండీ కానుక‌లు ఇప్ప‌టిదాకా ఆల‌యం లోప‌లే లెక్కిస్తున్నార‌ని, ఈ విభాగానికి ప్ర‌త్యేకంగా ఒక భ‌వనం ఉండాల‌ని చాలా ఏళ్లుగా చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు. 
 
పరకామణిలో ఇప్పుడు ఒక షిఫ్ట్‌లో 200 మంది చొప్పున రోజుకు 600 మంది పని చేస్తున్నార‌ని, ఒకేసారి 200 మంది కూర్చుని హుండీ కానుకలు లెక్కించడం వలన భౌతిక దూరం పాటించడం కష్టంగా ఉందన్నారు. పరకామణి విధుల‌కు వచ్చిన వారు కాల‌కృత్యాల‌కు వెళ్లాల్సి వస్తే ఆలయం బయటకు రావాల్సి ఉండ‌డం వ‌ల్ల చాలా ఇబ్బందిగా కలుగుతోందన్నారు. ఈ సమస్యలు తీర్చడానికే కొత్త భవనం నిర్మించాలని త‌మ బోర్డు నిర్ణ‌యించింద‌న్నారు.
 
14,962 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 8.90 కోట్లతో ఈ భ‌వ‌నాన్ని బెంగళూరుకు చెందిన శ్రీ కె. మురళీకృష్ణ అనే దాత నిర్మిస్తున్నార‌ని, చాలా సంతోష‌క‌ర‌మ‌ని ఛైర్మ‌న్ చెప్పారు. మొదటి బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో డిప్యూటీ ఈవో, ఏఈఓ, ఏవిఎస్ఓ గదులు, సిబ్బంది వెయిటింగ్ హాల్, రెండో బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో సార్టింగ్ హాలు, 1 హుండీ స్ట్రాంగ్ రూమ్, 1 పేరుబడి స్ట్రాంగ్ రూమ్‌తో పాటు డోనార్ సెల్ వెయిటింగ్ హాల్ ఉంటాయ‌ని తెలిపారు. మరో అంతస్తులో సార్టింగ్ హాల్, బ్యాంకులు సొమ్మును భ‌ద్ర‌ప‌రుచుకునేందుకు వీలుగా పది స్ట్రాంగ్ రూములు ఉంటాయ‌ని వివ‌రించారు.  
 
ప‌ర‌కామ‌ణి లెక్కింపును భ‌క్తులు చూసేందుకు వీలుగా అద్దాల‌తో ఈ నిర్మాణం ఉంటుంద‌ని, భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా క్యూలైన్లు ఏర్పాటుచేస్తామ‌ని తెలిపారు. దాత శ్రీ కె.మురళీకృష్ణ మాట్లాడుతూ పరకామణి నూతన భవనం నిర్మించే అవకాశం రావడం త‌న పూర్వజన్మసుకృతమన్నారు. వీలైనంత త్వరగా కొత్త భవనాన్ని పూర్తి చేస్తామ‌ని చెప్పారు.
 
కాగా, హుండీ లెక్కింపు ఆల‌య కైంక‌ర్యాల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మం కాదు. చాలా సంద‌ర్భాల్లో హుండీల‌ను శ్రీ‌వారి ఆల‌యం నుండి తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నానికి తీసుకెళ్లి లెక్కింపు చేయ‌డం జ‌రిగింది. ప్ర‌తిరోజూ జీయ‌ర్‌స్వాముల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌ర‌కామ‌ణి జ‌రుగుతుంది. సిబ్బంది కాల‌కృత్యాల కోసం వెలుప‌లికి వెళ్లిన‌పుడు, తిరిగి ప్ర‌వేశించిన‌పుడు ప్ర‌తిసారీ భ‌ద్ర‌తా సిబ్బంది త‌నిఖీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా భక్తుల క్యూలైన్‌కు అంత‌రాయం క‌లుగుతుంది. రోజుకు 13 నుండి 14 హుండీలు నిండుతాయి. వాటిని విప్పి కానుక‌లు లెక్కించేందుకు అవ‌స‌ర‌మైన స్థ‌లం ప్ర‌స్తుతం ఉన్న ప‌ర‌కామ‌ణి ప్రాంతంలో లేదు. ఈ కార‌ణంగా లెక్కింపు ఆల‌స్యం అవుతుండ‌టంతో దాదాపు రూ. 50 కోట్ల చిల్ల‌ర నాణేలు బ్యాంకుల‌కు అప్ప‌గించకుండా అలాగే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.
 
హుండీ విప్పిన‌పుడు వ‌చ్చే దుమ్ము, ధూళిని ఎగ్జాస్ట్ ఫ్యాన్ల ద్వారా బ‌య‌ట‌కు పంపే అవ‌కాశం ఇక్క‌డ లేదు. దీనివ‌ల్ల ఊపిరితిత్తుల‌కు సంబంధించిన ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయ‌ని ఉద్యోగులు త‌ర‌చూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కార‌ణంగా ఉద్యోగులు ప‌రకామ‌ణి విధులు నిర్వ‌హించేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సౌక‌ర్యాల‌తో ప‌ర‌కామ‌ణి ఉండాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు. ప‌ర‌కామ‌ణి నుండి చిల్ల‌ర నాణేల‌ను ఆల‌యం వెలుప‌లికి తీసుకురావ‌డం కూడా క‌ష్ట‌సాధ్యంగా మారుతోంది. దీనివ‌ల్ల భ‌క్తుల క్యూలైన్ల‌ను నిలపాల్సిన ప‌రిస్థితి.
 
ఈ ప‌రిస్థితుల్లో శ్రీ‌వారి ఆల‌యం నుండి ప‌ర‌కామ‌ణిని వెలుప‌లికి త‌ర‌లించి కానుక‌ల లెక్కింపు చేప‌ట్టాల‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి లిఖిత‌పూర్వ‌కంగా స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డం జ‌రిగింది. నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో సిబ్బంది కాల‌కృత్యాలు తీర్చుకోవ‌డానికి బ‌య‌ట‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా మ‌రుగుదొడ్ల వ‌స‌తి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. మంచి గాలి వెళుతురు ఉండేలా, దుమ్ము ధూళి వెలుప‌లికి పంపేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ల‌ను ఏర్పాటుచేస్తారు. ఏరోజు నాణేల‌ను ఆరోజు లెక్కించి డినామినేష‌న్ ప్ర‌కారం వేరుచేసేందుకు వీలుగా జ‌ర్మ‌నీలో త‌యారుచేసిన రెండు యంత్రాల‌ను స‌మ‌కూర్చ‌డం జ‌రుగుతుంది.