ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీకృష్ణాష్టమి
Written By జె
Last Modified: శనివారం, 8 ఆగస్టు 2020 (17:44 IST)

తిరుమలలో గోకులాష్టమి ప్రత్యేకం, ఏం చేస్తున్నారో తెలుసా?

తిరుమలలో ఆగస్టు 12న గోకులాష్టమి ఆస్థానం, 13న ఉట్లోత్సవం. తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 12వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.
 
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు.
 
శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. ఆగస్టు 13న తిరుమలలో ఉట్లోత్సవాన్ని పుర‌స్క‌రించ‌కుని సాయంత్రం 4 నుండి 6 గంటల వర‌కు శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు.  
 
కాగా, ప్ర‌తి ఏడాది తిరుమ‌లలో ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ హార‌తులు స్వీక‌రిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. కానీ ఈ ఏడాది కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.