మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (13:54 IST)

తిరుమలకు భక్తుల తాకిడి.. అక్టోబర్ 25, నవంబర్ 8 మూసివేత

tirumala
తిరుమలలో మళ్లీ భక్తుల తాకిడి పెరిగింది. తిరుమల క్షేత్రం భక్తులతో రద్దీగా కనిపిస్తోంది. సర్వదర్శనం కోసం భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 
 
కాగా, మంగళవారం తిరుమల శ్రీవారిని 75,175 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,979 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం లభించింది.
 
ఇకపోతే.. అక్టోబరు 25, నవంబర్ 8వ తేదీల్లో సూర్య, చంద్రగ్రహణాల కారణంగా తిరుమలలోని వేంకటేశ్వరుని ఆలయాన్ని దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నారు. 
 
తిరుమల కొండ గుడితో పాటు, దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న దాదాపు 60 ఆలయాలు అక్టోబర్ 25న "సూర్యగ్రహణం" కారణంగా మూసివేయబడతాయి. 
 
అలాగే మళ్లీ నవంబర్ 8వ తేదీన "చంద్రగ్రహణం" కారణంగా శ్రీవారి ఆలయం మూతపడనుంది. శుద్ధి, పుణ్యాహవచనం వంటి పూజల అనంతరం వెంకన్న ఆలయంలో పూజలు పునఃప్రారంభమవుతాయని టీటీడీ తెలిపింది.
 
అక్టోబర్ 25 మరియు నవంబర్ 8 తేదీలలో తిరుమల ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్-లింక్డ్ విఐపి బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇతర అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు నిలిపివేయబడతాయని టీటీడీ వెల్లడించింది. అయితే, ఈ రెండు రోజులూ నిర్దేశిత గంటలలో సాధారణ భక్తులను సర్వదర్శనానికి ఆలయ యంత్రాంగం అనుమతిస్తుంది.