తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతల స్వీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయనతో ఈవో జవహర్ రెడ్డి బుధవారం ప్రమాణం చేయించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాగా, తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడం ఇది రెండోసారి. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
ఇకపోతే, తితిదే బోర్డు సభ్యుల నియామకం చేపట్టనున్నారు. వైవీ సుబ్బారెడ్డి తొలిసారి 2019, జూన్ 21న టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఆ సమయంలో మొత్తం 37 మంది పాలకమండలి సభ్యులను నియమించారు. జూన్ 21వ తేదీ నాటికి వారి పదవీ కాలం ముగియడంతో కొత్త పాలక మండలి నియామక ప్రక్రియ కొనసాగుతోంది.