బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (17:13 IST)

బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి

నేటి ఆధునిక యుగంలో ప్రేమలు, పెళ్లిళ్ల కంటే వేగంగా విడాకులు, బ్రేకప్‌లు జరిగిపోతున్నాయి. అయితే బ్రేకప్ తర్వాత చాలామంది డిప్రెషన్‌లో పడిపోయి చెడు వ్యసనాలకు బానిసలవుతుంటే, మరికొంత మంది బాధ తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. బ్రేకప్‌ను హ్యాండిల్ చేయడంలో విఫలమైనవారే ఇలాంటి పనులు చేస్తుంటారు. ఆ సమయంలో ఇలాంటి పనులు చేస్తే బ్రేకప్ నుండి సులభంగా బయటపడవచ్చు. 
 
బాధను మీలోనే ఉంచుకోకుండా మీ సన్నిహితులతో పంచుకోండి. నలుగురితో పంచుకుంటే బాధ తగ్గుతుంది, అలాగే మీ ఆలోచనలపై ఒక క్లారిటీ వస్తుంది. బ్రేకప్ అయ్యాక మీ ఎక్స్ గురించి అతిగా విమర్శించకండి, తప్పు ఎవరి వైపున్నా అలా చేస్తే చేటు మీకే అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం అలవాటైపోయింది. ఇలా చేయడం కంటే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీకు ఉపశమనం కావాలంటే మీ భావాలను, ఆలోచనలను ఒక పేపర్‌పై పెట్టండి.
 
ఒక్కో సమయంలో సన్నిహితుల నుండి ఎంత సపోర్ట్ ఉన్నా మనస్సులో ఏదో మూల బాధ ఉంటుంది. అలాంటప్పుడు ఏడుపు వస్తే ఏమాత్రం చిన్నతనమనుకోకుండా తనివితీరా ఏడ్చేయండి. దీని వలన మీ భారం తగ్గుతుంది. బ్రేకప్ బాధ నుండి బయటపడటానికి ఇంకో రిలేషన్ స్టార్ట్ చేయమని సలహా ఇస్తుంటారు.

అలాంటి సలహాలు పట్టించుకోకుండా మీ మనస్సుకు ఏది అనిపిస్తే అలానే చేయండి. కొంతమంది బ్రేకప్ అయ్యాక కూడా మళ్లీ మళ్లీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, వాటిని చూసుకుంటూ టైమ్ వేస్ట్ చేస్తుంటారు. మీతో బ్రేకప్ అయ్యాక అవతలి వ్యక్తి జీవితంలో ముందుకు సాగిపోతుంటారు, కాబట్టి మీకు ఒరిగేదేం ఉండదు. కాబట్టి మీ మాజీని గుర్తు చేసే ఎలాంటి విషయాలనైనా దరి చేరకుండా చూసుకోండి.
 
వ్యాయామం చేయడం, గార్డెనింగ్ చేయడం, పుస్తకాలు చదవడం వంటి కొత్త వ్యాపకం ఏదైనా అలవాటు చేసుకోండి. దీని వలన మీరు పాత జ్ఞాపకాలను మర్చిపోవడమే కాకుండా మంచి అలవాట్లను కూడా చేసుకున్నట్లు అవుతుంది.

అంతా అయిపోయాక, ఇలా ఎందుకు జరిగిందంటూ విశ్లేషించుకోవడం, ఇలా జరగకపోయి ఉంటే బాగుండేదనుకోవడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. జరిగిందంతా మన మంచికే అనే ధోరణిలో ఆలోచిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
 
ఎలాంటి గాయాన్నైనా నయం చేసే శక్తి కాలానికి ఉంటుంది. మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం మరుపు. కాబట్టి వీటన్నింటినీ పాటిస్తే కొంత కాలానికి మీ పాత జీవితం గురించి మర్చిపోయి కొత్త జీవితానికి పునాది వేసుకోవచ్చు.