శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (12:36 IST)

కేంద్ర బడ్జెట్‌- దేశీయ స్టాక్ మార్కెట్ బుల్ పరుగులు.. సెన్సెక్స్ అదుర్స్

కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభం కాగానే దేశీయ స్టాక్ మార్కెట్ బుల్ పరుగులు తీసింది. ఉదయం పదకొండు గంటలకు నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే స్టాక్ మార్కెట్లో కదలికలు మొదలయ్యాయి. ఆ తర్వాత కేటాయింపులు.. వివిధ రంగాలకు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు వివరిస్తున్న తరుణంలో స్టాక్ మార్కెట్లలో దూకుడు మొదలైంది. 
 
ప్రస్తుతం బిఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు లాభంలో ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలుంటాయని ఆర్థిక మంత్రి ప్రకటించడం స్టాక్ మార్కెట్లకు ఊతమిస్తోందని అంచనా వేస్తున్నారు. వివిధ శాఖలకు కేటాయింపులు ప్రకటిస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో వేగం పెరిగింది. ఫలితంగా మధ్యాహ్నం 12 గంటల సెన్సెక్స్ 40,779 పాయింట్లతో 55.67 పాయింట్ల వృద్ధితో ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.
 
కాగా..  వ్యవసాయాభివృద్ధికి 16 సూత్రాల కార్యక్రమం చేపడుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు కొత్త గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు. 
 
సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ విధానాన్ని సరళతరం చేస్తున్నామన్నారు. రైతుల కోసం కృషి ఉడాన్ పథకం తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.