శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మార్చి 2020 (10:52 IST)

కళ తప్పిన బులియన్ మార్కెట్.. బంగారం ధరలు నేలచూపు

బులియన్ మార్కెట్ కళ తప్పింది. బంగారం ధరలు నేల చూపుచూస్తున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. ఈ వైరస్ భయంతో ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పతనావస్థలో కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు పడిపోతున్నాయి. 
 
తాజాగా ప్రపంచ మార్కెట్ల పతనం బంగారం ధరను భారీగా దిగజార్చింది. మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.830 తగ్గి, 2 శాతం పతనంతో రూ.39,518కి చేరింది. ఇటీవలి కాలంలో బంగారం ధర రూ.40 వేల దిగువకు రావడం ఇదే తొలిసారి. ఇదేసమయంలో వెండి ధర కిలోకు ఏకంగా రూ.4,280 తగ్గి రూ.36,207కు చేరింది. క్రూడాయిల్ ధర రూ.235 తగ్గి రూ.2,161కి చేరింది. సోమవారం నాటితో పోలిస్తే క్రూడాయిల్ ధర 10 శాతం వరకూ పడిపోవడం గమనార్హం.
 
మరోవైపు, బులియన్‌ మార్కెట్‌ కళ తప్పుతోంది. మార్కెట్‌ నీరసించడంతో పసిడి దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో (2019 ఏప్రిల్‌-2020 ఫిబ్రవరి) బంగారం దిగుమతులు అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 8.86 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో 2,962 కోట్ల డాలర్లు ఉన్న పసిడి దిగుమతులు.. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి 11 నెలల్లో 2,700 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.9 లక్షల కోట్లు) దిగొచ్చాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 17,300 కోట్ల డాలర్ల నుంచి 14,312 కోట్ల డాలర్లకు తగ్గింది.