శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మార్చి 2020 (10:03 IST)

స్టాక్ మార్కెట్ : ఒక్క నిమిషంలో రూ.13 లక్షల కోట్లు హాంఫట్...

భారత స్టాక్ మార్కెట్‌లో మరో చీకటి రోజు నమోదైంది. ఒకవైపు కరోనా వైరస్ ప్రకంపనలతో పాటు.. క్రూడా అయిల్ ధరల పతనం, అంతర్జాతీయ మార్కెట్ల పతనం వంటి పరిణామాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మరోమారు కుప్పకూలిపోయాయి. ఫలితంగా శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం ఒక్క నిమిషంలోనే రూ.13 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. 
 
గురువారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, శుక్రవారం ఉదయం కూడా పతనంతోనే ఆరంభమయ్యాయి. శుక్రవారం 9.15 గంటలకు మార్కెట్ సెషన్ ప్రారంభంలోనే క్రితం ముగింపుకన్నా 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, 9.20 గంటల సమయానికి 3,090 పాయింట్ల నష్టంలోకి వెళ్లిపోయింది. గురువారం ముగింపుతో పోలిస్తే ఇది 9.43 శాతం పతనం. ప్రస్తుతం బీఎస్ఈ సూచిక 30,137 పాయింట్లకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం అదే దారిలో పయనిస్తూ, 852 పాయింట్లు పడిపోయి, 8,737 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
 
గురువారం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 1,37,12,558.72 కోట్లుగా ఉండగా, ఈ ఉదయం అది మరో రూ.9 లక్షల కోట్లకు పైగా తగ్గి, 1,24,11,324 కోట్లకు చేరుకుంది. ఎన్ఎస్ఈ-50, బీఎస్ఈ-30లోని అన్ని కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో సైతం నష్టాల తీవ్రత అధికంగా ఉంది. కాగా, 8,800 పాయింట్ల వద్ద కొనుగోలు మద్దతును కూడగట్టుకోవడంలో నిఫ్టీ విఫలం కాగా, ఈ పతనం మరింత అధికం కావచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
 
మరోవైపు, తమ వద్ద ఉన్న కంపెనీల వాటాలను అమ్మేద్దామని భావించే వారు తప్ప, కొనుగోలు చేయాలని చూసేవారు ఒక్కరూ కనిపించక పోవడంతో, భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచికలు సెన్సెక్స్, నిఫ్టీ ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. సూచికలు 10 శాతం పతనం కాగానే, ట్రేడింగ్‌ను నిలిపివేస్తున్నట్టు సెబీ వర్గాలు ఆదేశించాయి. సరిగ్గా 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక 29,687.52 పాయింట్ల వద్ద ఉన్న సమయంలో ట్రేడింగ్‍ను నిలుపుదల చేశారు. ఎన్ఎస్ఈ సూచిక 10.07 శాతం పడిపోయి 8,624 పాయింట్ల వద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 966 పాయింట్లు తక్కువ.