పీవీ సింధుకు రెండు ఎకరాల భూమి కేటాయింపు.. జగన్‌కు కృతజ్ఞతలు
ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి పీవీ సింధుకు భూమిని కేటాయిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రూరల్ చినగడిలి గ్రామంలో రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ భూమిని పశుసంవర్ధక శాఖ నుంచి యువజన సర్వీసులు, క్రీడలకు బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్థలంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
అకాడమీ అవసరాల కోసమే ఆ భూమి ఉపయోగించాలని కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగించవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అకాడమీ ద్వారా ప్రతిభ ఉన్న పేదవారికి లాభాపేక్ష లేకుండా శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఈ సందర్భంగా.. సీఎం జగన్‌కు సింధు కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖపట్నంలో అత్యున్నత స్థాయి మౌలిక వసతులతో అకాడమీ ఏర్పాటు చేయాలని తాను భావించడం జరిగిందని, భూమి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తొలి దశలో అకాడమీ నిర్మిస్తామని, తర్వాతి దశలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదన ఉందని సింధు గతంలో వెల్లడించారు. ప్రతిభ కలిగిన పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సాహించాలని సీఎం జగన్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.