సాకర్ పోటీలకు భారత్ ముస్తాబవుతుంది. వచ్చే నెల ఆరో తేదీ నుంచి జరిగే ఈ పోటీల్లో ఏకంగా 24 దేశాలకు చెందిన జట్లు తలపడనున్నాయి. ఈ తరహా టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలోని ఆరు వేదికల్లో మూడు వారాలపాటు 2017 అండర్-17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు జరుగనున్నాయి.
ఈ భూఖండంలోని 204 దేశాలలో పిల్లల నుంచి పెద్దలవరకూ, మహిళల నుంచి పురుషుల వరకూ అందరూ ఆడే ఆట. ప్రపంచ జనాభాలో ఎక్కువమంది ఆడే ఈ ఆటకు జనాభాలో రెండో అతిపెద్ద దేశం భారత్‌లో మాత్రం ఆదరణ, ప్రచారం చెప్పుకోదగిన స్థాయిలో లేవు. ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత స్థానం 98 అంటే.. ఫుట్‌బాల్‌కు మనదేశంలో ఏపాటి ప్రాధాన్యం ఉందే మరి చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పటివరకూ ప్రపంచ ఫుట్‌బాల్‌లోని వివిధ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో ఏ ఒక్కదానికీ భారత్ ఇంతకుముందు వరకూ ఆతిథ్యమివ్వలేదు. అయితే ఆ లోటు 2017 ప్రపంచ అండర్-17 ప్రపంచ ఫుట్‌బాల్ టోర్నీతో తీరబోతోంది. భారత ఫుట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న భారత్ గడ్డపై తొలిసారిగా జరుగనున్న ఈ పోటీల కోసం ఓ ప్రత్యేక ప్రచారగీతాన్ని సైతం సిద్ధం చేశారు.
టైటిల్ కోసం పోటీపడుతున్న మొత్తం 24 జట్లను ఆరు గ్రూపులుగా విభజించారు. న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, కొచ్చిన్, గౌహతీ, గోవా వేదికలుగా ఈ పోటీలు నిర్వహిస్తారు. ఆతిథ్య భారత్‌తో పాటు అమెరికా, కొలంబియా, ఘనా, పరాగ్వే, మాలీ, న్యూజిలాండ్, టర్కీ, ఇరాన్, గినీ, జర్మనీ, కోస్టారికా, కొరియా, నైజర్, బ్రెజిల్, స్పెయిన్ జట్లు పోటీకి దిగుతున్నాయి. పోటీలో ఉన్న ఇతర దేశాల జట్లలో హోండ్యురస్, జపాన్, న్యూకాలెడోనియా, ఫ్రాన్స్, ఇరాక్, మెక్సికో, చిలీ, ఇంగ్లండ్ సైతం ఉన్నాయి.
గ్రూప్- ఏ లీగ్‌లో అమెరికా, కొలంబియా, ఘనాలాంటి మేటి జట్లతో భారత్ పోటీపడుతుంది. న్యూఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా భారతజట్టు తన మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్- బీలో పరాగ్వే, మాలీ, న్యూజిలాండ్, టర్కీ తలపడితే గ్రూప్- సీలో ఇరాన్, గినీ, జర్మనీ, కోస్టారికాజట్లు పోటీపడతాయి. ఇక గ్రూప్- డీలో కొరియా, నైజర్, బ్రెజిల్, స్పెయిన్ గ్రూప్-ఇలో హోండ్యురస్, జపాన్, న్యూకాలిడోనియా, ఫ్రాన్స్ జట్లు, గ్రూప్ -ఎఫ్‌లో ఇరాక్, మెక్సికో, చిలీ, ఇంగ్లండ్ జట్లు తలపడతాయి. అక్టోబర్ 6న జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ఘనాతో కొలంబియా, అమెరికాతో భారత్ పోటీపడతాయి. అక్టోబర్ 26న సెమీఫైనల్స్, అక్టోబర్ 28న కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియం వేదికగా ఫైనల్స్ నిర్వహిస్తారు.