శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (08:32 IST)

భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఇకలేరు...

భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. ఆసియా క్రీడల్లో నాలుగుసార్లు బంగారు పతకాలు కొల్లగొట్టిన ఈ స్ప్రింటర్‌ను కరోనా మహమ్మారి కాటేసింది. కొవిడ్ అనంతరం సమస్యలతో గత రాత్రి చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఆసుపత్రిలో కన్నుమూశారు. తన తండ్రి మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు, దిగ్గజ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ ధ్రువీకరించారు.
 
గత మే నెల 20వ తేదీన కరోనా వైరస్ బారినపడిన మిల్కా సింగ్... కొన్ని రోజుల చికిత్స తర్వాత ఈ నెల 16వ తేదీ నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆయనను నాన్ కొవిడ్ ఐసీయూ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే గత రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఈయన భార్య, ఇండియన్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన నిర్మల్ సైనీ కౌర్ కరోనాతో ఈ నెల 13న మృతి చెందిన విషయం తెల్సిందే. 
 
20 నవంబరు 1932లో నేటి పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని గోవింద్‌పుర‌లో మిల్కాసింగ్ జన్మించారు. పరుగుల పోటీల్లో భారత కీర్తి పతాకను వినువీధుల్లో చాటారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. 
 
1958లో కామన్వెల్త్ పోటీల్లో 46.6 సెకన్లలోనే 440 గజాల దూరం పరుగెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కారు. 1959లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
 
మిల్కా సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కాంగ్రెస్ ఆపద్ధర్మ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు సంతాపం తెలిపారు.