శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 జులై 2021 (11:50 IST)

టోక్యో ఒలింపిక్స్ క్రీడా వేదికలో మరో మైక్ టైసన్

బాక్సింగ్ క్రీడాకారుడు మైక్ టైసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందరో బాక్సర్లను మట్టికరిపించిన టైసన్... తాను ఓడిపోతున్నానని తెలుసుకుని ప్రత్యర్థి చెవి కొరికేసి నిషేధానికి గురయ్యాడు. ఈ ఘటన 1997లో ఇవాండర్‌ హోలీఫీల్డ్‌తో పోరులో ఈ యోధుడు చెవి కొరకడం అప్పట్లో పెద్ద సంచలనం. 
 
అయితే ఇపుడు జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న  ఒలింపిక్స్‌లోనూ దాదాపు అలాంటి ఘటనే చోటుచేసుకుంది. హెవీ వెయిట్‌ విభాగంలో డేవిడ్‌ నికా (న్యూజిలాండ్‌)తో పోరులో మొరాకో బాక్సర్‌ యూనెస్‌ బల్లా ప్రత్యర్థి చెవిని కొరికాడు. కాని మౌత్ గార్డ్ ఉండటంతో పంటి గాయాలుకాలేదు. 
 
ఈ పనిని మ్యాచ్ రిఫరీ గుర్తించలేదు. టీవీలో మాత్రం కనబడింది. ఈ పోరులో నికా చేతిలో బల్లా ఓడిపోయాడు. బల్లా చేసిన పనిని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ నికా మాత్రం ప్రత్యర్థిని వెనకేసుకొచ్చాడు. ‘‘క్రీడల్లో ఇలాంటి మామూలే. అతడి అసహనాన్ని అర్ధం చేసుకోగలను. ఆటగాడిగా బల్లాను గౌరవిస్తున్నా’’ అని నికా చెప్పాడు.