సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:00 IST)

ఒలింపిక్స్ క్రీడల్లో కబడ్డీని చేర్చేందుకు ప్రధాని మోడీ కృషి చేయాలి!! పోలండ్ కబడ్డీ చీఫ్

Kabaddi
వచ్చే 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో కబడ్డీ క్రీడకు చోటు కల్పించేలా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేయాలని, ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా చొరవు తీసుకోవాలని పోలాండ్ కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు మిచెల్ స్పిక్ట్రో వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన తమ దేశంలో పర్యటిస్తున్న ప్రధాని మోడీని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విశ్వక్రీడలు ఒలింపిక్ క్రీడా పోటీల్లో కబడ్డీకి చోటు దక్కితే బాగుంటుందన్నారు. 2036 ఒలింపిక్స్ కబడ్డీకి చోటు దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆ దిశగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకోవాలని కోరారు. కాగా, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ బిడ్డింగ్ వేస్తుందని ఇప్పటికే మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే.
 
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం మిచల్ స్పిక్ట్రో మాట్లాడుతూ, "మోడీతో మాట్లాడిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. ప్రధాని మోడీ వల్ల భారత్ అన్ని రంగాలలో బలంగా మారుతోంది. క్రీడారంగంలో మునుపటి కంటే బలంగా తయారైంది. ప్రతి క్రీడలోనూ రాణిస్తోంది. అహ్మదాబాద్ నగరంలో భారీ స్టేడియం నిర్మాణంలో మోడీ కృషి ఎంతో ఉంది. అక్కడ నేను వరల్డ్ కప్ ఆడా. ఇక 2036 ఒలింపిక్స్ విశ్వక్రీడలను నిర్వహించేందుకు భారత్ గట్టిగా ప్రయత్నిస్తే బాగుంటుంది. ఆ బిడ్డింగ్‌ను దక్కించుకుంటుందనే అనుకుంటున్నా. అందులో కబడ్డీ ఉంటుందని ఆశిస్తున్నా' అని మిచల్ స్పిక్ట్రో అభిప్రాయపడ్డారు.