సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (18:51 IST)

టోక్యో పారాలింపిక్స్ : భారత్ ఖాతాలో మరో పతకం

టోక్యో వేదికాగ పారాలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా భారత్ ఖాతాలో టేబుల్ టెన్నిస్ విభాగంలో ఒక వెండి పతకం వచ్చి చేరింది. ఇపుడు మరో పతకం వచ్చింది. భారత క్రీడాకారుడు నిషాద్ కుమార్ హైజంప్‌లో రజత పతకం సాధించి రికార్డు సృష్టించాడు. 
 
ఫలితంగా ఐదో రోజైన ఆదివారం భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషల హై జంప్‌లో అమెరికా అథ్లెట్ టౌన్‌సెండ్ రోడెరిక్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకోగా, రెండో స్థానంలో నిలిచిన నిషాద్‌కు రజతం దక్కింది. 
 
కాగా, ఆదివారం ఉదయం టేబుల్ టెన్నిస్‌లో భారత క్రీడాకారిణి భవీనా పటేల్ రజతం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించింది. నిషాద్ సహచరుడు రామ్ పాల్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 
 
నిషాద్ తొలి ప్రయత్నంలో 2.06 మీటర్ల మార్కును చేరుకోగా, పసిడి పతక విజేత రోడెరిక్ రికార్డు స్థాయిలో 2.15 మీటర్ల మార్కును చేరుకున్నాడు. అమెరికాకే చెందిన వైజ్ డల్లాస్ 2.06 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. 
 
పారాలింపిక్స్‌లో నిషాద్ రజతం సాధించిన విషయాన్ని ‘సాయ్’ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. హైజంప్ టీ47 ఫైనల్‌లో నిషాద్ 2.06 మీటర్లు జంప్ చేసి ఆసియా రికార్డును సమం చేయడమే కాక, వ్యక్తిగత రికార్డును మెరుగుపరుచుకున్నట్టు పేర్కొంటూ అతడికి అభినందనలు తెలిపింది.