బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (09:54 IST)

ఈ కోకకోలా బాటిల్‌ను పక్కనబెట్టండి.. తాగునీటినే తాగండి.. క్రిస్టియానో రొనాల్డో (video)

పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఫిట్‌నెస్ విషయంలో రాజీపడడు. డైట్‌ ఫాలో అవుతాడు. తన ఆహారంలో కేలరీస్‌ ఎక్కువగా లభించే జంక్‌ఫుడ్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. తాజాగా ఓ మీడియా సమావేశంలో తన ముందున్న కోకకోలా బాటిల్‌ను పక్కన పెట్టేసి ఇలాంటివి పక్కనబెట్టండి.. నీటిని తాగండి అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
యూఈఎఫ్‌ఏ యూరోకప్‌ 2020లో భాగంగా రొనాల్డో జట్టు కెప్టెన్‌ హోదాలో కోచ్‌ ఫెర్నాండో సాంటోస్‌తో కలిసి మంగళవారం ప్రెస్‌ మీట్‌లో రొనాల్డో పాల్గొన్నాడు. అయితే తాను కుర్చీలో కూర్చునేటప్పుడు టేబుల్‌పై కోకకోలా బాటిల్స్‌ కనిపించాయి. వెంటనే వాటిని చేతిలోకి తీసుకున్నాడో అర్థం కాలేదు.. కానీ తర్వాత తన మాటలతో అర్థం చేసుకున్న అతను రొనాల్డొను అభినందించాడు.
 
యూరోకప్‌ 2020లో భాగంగా పోర్చుగల్‌ గ్రూఫ్‌ ఎఫ్‌లో ఉంది. పోర్చుగల్‌తో పాటు జర్మనీ, ప్రాన్స్‌, హంగేరీ కూడా ఉండడంతో అంతా ఈ గ్రూఫ్‌ను ''గ్రూఫ్‌ ఆఫ్‌ డెత్‌''గా అభివర్ణిస్తున్నారు. కాగా 2016లో జరిగిన యూరోకప్‌లో రొనాల్డో ఆధ్వర్యంలోనే పోర్చుగల్‌ ఫ్రాన్స్‌ను ఫైనల్లో ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. డిపెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతున్న పోర్చుగల్‌ మరోసారి చాంపియన్‌గా నిలవాలని చూస్తుంది. 
 
36 ఏళ్ల రొనాల్డోకిది వరుసగా ఆరో 'యూరో' చాంపియన్‌షిప్‌ కావడం విశేషం. కాగా రొనాల్డో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పోర్చుగల్‌ తరపున ఇప్పటివరకు 104 గోల్స్‌ చేశాడు. మరో ఏడు గోల్స్‌ చేస్తే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇరాన్‌ మాజీ ప్లేయర్‌ అలీ దాయి (109 గోల్స్‌) పేరిట ఉంది.