వింబుల్డన్‌లో సత్తా చాటిన సానియా మీర్జా.. టోక్యో ఒలింపిక్స్‌లో అరుదైన రికార్డ్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో సత్తా చాటింది. వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగం తొలి రౌండ్లో గెలుపును నమోదు చేసుకుంది. ఆరో సీడ్ అయిన డిసారై మరియు అలెక్సా గురాచీలపై సానియా జోడీ 7-5, 6-3 పాయింట్ల తేడాతో విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది.
అమెరికా పార్ట్‌నర్ బెథానీతో కలిసి గురువారం జరిగిన తొలి రౌండ్లో మెరుగ్గా ఆడింది. ఫలితంగా తొలి డబుల్స్ రౌండ్ ఇండో-అమెరికా జోడీ వశమైంది. ఈ మ్యాచ్‌ను ఒక గంటా 27 నిమిషాల్లో సొంతం చేసుకుంది సానియా జోడీ.
ఇకపోతే.. సానియా మీర్జా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్ 2020తో భారత్ తరఫున నాలుగు ఒలింపిక్స్ల్లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్‌గా సానియా మీర్జా నిలవనుంది.
జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సమ్మర్ గేమ్స్ కోసం సిద్ధమవుతున్న ఈ భారత టెన్నిస్ స్టార్.. మైదానంలోనే కాకుండా బయట కూడా కష్టపడుతున్నానని చెప్పింది. కోర్టులో చురుకుగా కదిలేందుకు చాలా కసరత్తులు చేస్తున్నట్లు తెలిపింది. అంకితా రైనాతో కలిసి సానియా.. టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతోంది.
2018లో ఇజాన్‌కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచి సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించింది సానియా. ఈ వారమే జరిగిన ఈస్ట్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో తొలి రౌండ్‌లోనే సానియా నిరాశపరిచింది. బెతాని మ్యాటెక్ సాండ్స్ (అమెరికా)తో జతకట్టిన హైదరాబాదీకి తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ప్రస్తుతం వింబుల్డన్, ఒలింపిక్స్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వింబుల్డన్ తొలి డబుల్స్ రౌండ్లో గెలుపును నమోదు చేసుకుంది.